navageetam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 6:37 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

వరి ధాన్యం కొనుగోళ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి

మిల్లుల వద్ద లారీలను 24 గంటల్లో అన్లోడ్ చేయాలి :

జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం మిల్లులకు తరలింపులో ఎలాంటి అలసత్వం వహించరాదని, మిల్లుల వద్దకు చేరుకున్న లారీలను 24 గంటల్లోగా అన్లోడ్ చేసి వెంటనే పంపించాలని స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ నుండి మండల తహసీల్దార్లు, ఎస్‌హెచ్‌వోలు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, ప్యాక్స్ సీఈవోలు, సీఓలతో గూగుల్ మీట్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పురోగతి, ధాన్యం నిల్వలు, రవాణా, హమాలీల ఏర్పాటు, గన్నీ బ్యాగుల సరఫరా తదితర అంశాలపై సమగ్రంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని ఆలస్యం లేకుండా కొనుగోలు చేయాలని సూచించారు. కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో తాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, నీడ, టార్పాలిన్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే లిఫ్టింగ్ చేసి గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అధికారులు, మిల్లర్లు, రవాణా యాజమాన్యాలు సమన్వయంతో పని చేసి కొనుగోళ్లు విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు. ప్రతి రోజు కొనుగోలు వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేసి నివేదికలు సమర్పించాలని, కొనుగోలు కేంద్రాల వద్ద పూర్తి పారదర్శకత పాటించాలని అదనపు కలెక్టర్ బి.ఎస్ లత ఆదేశించారు.