24 గంటల్లోనే లారీల అన్లోడింగ్ పూర్తి చేయాలి
అదనపు కలెక్టర్ బి.ఎస్ లత
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్ లత అధికారులను ఆదేశించారు. శనివారం కొడిమ్యాల మండలం నాచుపెల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు మరియు శ్రీ రామాంజనేయ రైస్ మిల్లులను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన అదనపు కలెక్టర్, హమాలీలు తగిన సంఖ్యలో అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. ధాన్యం లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లారీలను ఆలస్యం లేకుండా రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ట్రక్ షీట్ నమోదు, ట్యాబ్ ఎంట్రీలు తదితర డాక్యుమెంటేషన్ పనులను ఎలాంటి పెండింగ్ లేకుండా సమయానికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించడంతో పాటు రైతులకు సరైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు సమయంలో తేమ శాతం, నాణ్యత ప్రమాణాలను ఖచ్చితంగా పరిశీలించాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు. అనంతరం రైస్ మిల్లులను తనిఖీ చేసిన బి.ఎస్ లత, మిల్లర్లు హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ధాన్యంతో వచ్చిన లారీలను 24 గంటల్లోగా అన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని, మిల్లర్లు అధికారులతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు. ధాన్యం అన్లోడింగ్‌లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డీటీ, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
