పొరుమల్ల గ్రామంలో 16 సీసీ కెమెరాల ప్రారంభం
నవగీతం,జగిత్యాల ప్రతినిధి:
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలలో భాగంగా శనివారం మెట్‌పల్లి డీఎస్పీ రాములు మేడి పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోని పొరుమల్ల గ్రామo లో ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. గ్రామ భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. నేరాల నివారణ, నేరస్తుల గుర్తింపు, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడంలో సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు పోలీసులకు ఒక శక్తివంతమైన ఆయుధంలా మారాయని పేర్కొన్నారు. ఏదైనా నేరం జరిగినప్పుడు దానిలో పాల్గొన్న నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. గ్రామంలో జరిగే చిన్న చిన్న సంఘటనల నుండి పెద్ద ఘటనల వరకు ప్రతి అంశాన్ని సీసీ కెమెరాల ద్వారా తక్షణమే గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు.సీసీ కెమెరాలు 24 గంటలు పనిచేస్తూ ప్రజలకు నిరంతర భద్రతను అందిస్తాయని, నేరాలను తగ్గించడంలో మరియు అనుమానాస్పద కార్యకలాపాలను ముందుగానే గుర్తించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని వివరించారు.

ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. పోలీసులకి ప్రజల సహకారం తోడైతేనే శాంతి భద్రతలు మరింత బలపడతాయని, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ద్వారా నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చని డీఎస్పీ పేర్కొన్నారు.అలాగే ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు.సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఎవరికీ తెలియజేయకూడదని సూచించారు. ఈ యొక్క కార్యక్రమం లో కోరుట్ల సి.ఐ లక్ష్మీనారాయణ, ఎస్.ఐ శ్రీధర్ రెడ్డి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
