navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 9:06 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

పేదల దరికే ప్రభుత్వ పథకాలు

చేసింది..చేయబోయేది చెబుతాం విస్తృత ప్రచారంతోనే పేదలకు లబ్ధి

పాలన-ప్రగతి ప్రణాళిక కొత్తపల్లి సభలో ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి

నవగీతం,కరీంనగర్ ప్రతినిధి:

సంక్షేమ పథకాల ద్వారా పేదలకు లబ్ధి చేకూరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని మానకొండూర్ ఎమ్మెల్యే, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని సాయిరాం గార్డెన్ లో జరిగిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఆ పథకాలన్నీ పేదల దరికి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. విస్తృత ప్రచారాల ద్వారానే ప్రజలకు తెలియజేసి ఆ పథకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.అలాంటప్పుడే ఎక్కుమ మంది నిరుపేదలకు ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందగలుగుతారన్నారు. దేశాన్ని పట్టి పీడించిన పోలియో వ్యాధి సమస్యపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం, అవగాహన కల్పించడం వల్లనే ఆ వ్యాధిని సమర్థవంతంగా నివారించగలిగామని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిందని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతోపాటు చేపట్టబోయే పథకాలు, పనుల గురించి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పేరిట 99 రోజులపాటు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా,రాష్ట్ర స్థాయిల్లో సభలు నిర్వహిస్తున్నామన్నారు.గత బీఆర్ఎస్ పాలకులు పదేళ్ల కాలంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారని, కనీసం రేషన్ కార్డుల్లోనైనా అదనపు పేర్లు చేర్పించలేకపోయారని ఎమ్మెల్యే విమర్శించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇస్తామంటూ ఆశలు కల్పించి గత పాలకులు నిరాశపర్చారని, దళిత బంధు, రైతు బంధు పేరిట పెద్ద మొత్తంలో డబ్బు దండుకున్నారని ఆయన ఆరోపించారు. రైతులను రుణ విముక్తులను చేయాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణ మాఫీ చేసిందని చెప్పారు. గృహ జ్యోతి కింద ప్రభుత్వం 200 యూనిట్ల వరకు వాడకం దారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, 80శాతం కుటుంబాలు ఈ ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని పొందుతున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఆ దిశగా చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చెప్పారు. నియోజకవర్గ కేంద్రమైన మానకొండూర్ లో నిర్మాణంలో ఉన్న 50 పడకల ఆస్పత్రి త్వరలో అందుబాటులోకి రానున్నదని, దీని వల్ల వైద్య సేవలకు ప్రజలకు మరింత చేరువవుతాయని ఆయన పేర్కొన్నారు. నియోజవర్గంలోని ఆయా మండల్లోని ప్రభుత్వ పాఠశాలలు,మోడల్ స్కూళ్లును సందర్శిస్తూ సమస్యల గురించి తెలుసుకుంటూ మౌలిక సదుపాయాలు సమకూరుస్తున్నామన్నారు.గత బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. తిమ్మాపూర్ మండలం యాదవులపల్లిలో 200 కోట్లతో మంజూరైన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. వ్యవసాయ కళాశాలను కూడా నియోజవకవర్గానికి మంజూరు చేయించుకోగలిగామన్నారు. పేదలకు సేవలు చేసినప్పుడే నిజమైన సంతృప్తిని పొందగలుగుతామని, ఆ క్రమంలోనే ప్రజలకు సేవలు అందిస్తానని డాక్టర్ కవ్వంపల్లి చెప్పారు.జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ కార్యక్రమం విజయవంతం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక పేరిట నిర్వహించే గ్రామ సభల ద్వారా ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా ప్రజలు లబ్ధిపొందుతున్నారని, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా తోపాటు ఇతర పథకాల ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్న ప్రజా ప్రభుత్వం త్వరలో మరికొన్ని పథకాలు అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నదని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ స్థాయి వరకు విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనున్నదని ఆయన చెప్పారు. రైతులు వరి సాగుపైననే కాకుండా ప్రత్యామ్నయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒకే రకమైన పంట పండించడం వల్ల భూసారం దెబ్బతింటుందన్నారు. అందుకే పంటల మార్పిడి చేపట్టాలన్నారు.

నూనె గింజల సాగు చేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని, ఆ దిశగా రైతులు ఆలోచించాలని ఆయన కోరారు.ఈ సమావేశంలో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోదారి శోభారాణి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, ఉప కార్యనిర్వహణాధికారి పవన్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, బెజ్జంకి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, తహసీల్దార్లు కర్ర శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్, సురేఖ, కనకయ్య,శ్రీకాంత్, సురేష్, ఎంపీడీవోలు మల్హోత్ర, వి.వి.వరలక్ష్మి, కృష్ణప్రసాద్,కె.ప్రవీణ్, క్షయవ్యాధి నివారణ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి, ట్రాన్స్ కో ఏఈ ఖాసీం, ఏఎంసీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారి రమేశ్, నందగిరి రవీంద్రచారి, గోపగోని బస్వయ్యగౌడ్, ముస్కు ఉపేందర్ రెడ్డి, ముక్కిస రత్నాకర్ రెడ్డి, కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డితోపాటు వివిధ శాఖల మండల అధికారులు, సర్పంచులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

తిమ్మాపూర్ మండలానికి చెందిన 37 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ జరిగింది. కొత్తపల్లి సాయిరాం గార్డెన్ లో శనివారం జరిగిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక నియోజకవర్గస్థాయి సభలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఈ చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. చెక్కులు పొందిన వారిలో 35 మంది కళ్యాణ లక్ష్మి, ఇద్దరు షాదీ ముబారక్ లబ్ధిదారులు ఉన్నారు.