navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 6:47 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమావేశం

ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి: జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత

నవగీతం, కోరుట్ల ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కోరుట్ల పట్టణంలోని సి యం ఆర్  గార్డెన్స్ లో నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గస్థాయి సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి. ఎస్ లత పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత మాట్లాడుతూ..ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా కార్యక్రమాల్లో ప్రతి శాఖ సమన్వయంతో పని చేసి, నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేపట్టి, పనుల పురోగతిని నిరంతరం సమీక్షించాలన్నారు. ప్రజా పాలన కార్యక్రమాలు నిర్వహించి సమయంలో ప్రజల నుండి వినతులు వస్తే అర్హులైన వారిని గుర్తించి వెంటనే పరిష్కరించాలని అన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంతో పాటు, అర్హత ప్రమాణాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు.రెవెన్యూ సంబంధిత సమస్యలను ప్రత్యేక దృష్టితో పరిష్కరించేందుకు మండల స్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలను నమోదు చేసి వాటి పరిష్కారానికి గడువులు నిర్ణయించి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.భూ సంబంధిత సమస్యలు, రేషన్ కార్డులు, పింఛన్లు వంటి అంశాలపై వేగవంతమైన పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని వివరించారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, ఏ సమస్య ఉన్నా అధికారులను నేరుగా సంప్రదించాలని ఆమె సూచించారు. అనంతరం బాలల భద్రత, డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాలపై ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీవో జివాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వసంత తిరుమల, జిల్లా స్థాయి అధికారులు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, మండల స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు, కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు తదితరులు పాల్గొన్నారు.