navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 May 2026, 2:48 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి :

ప్రజావాణిలో ప్రజలు అందజేసే ఫిర్యాదులు, వినతులపై సమగ్ర విచారణ చేపట్టి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులను స్వీకరించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశతో ప్రజావాణికి వస్తారని, అధికారులు శాఖల వారీగా అందిన అర్జీలపై సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి, పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ రోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 81 ఫిర్యాదులు, వినతులు అందినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం తెలంగాణ టూరిజం శాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.