navageetam.com
Newspaper Banner
Date of Publish : 27 May 2026, 7:46 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రాణంతో మన మధ్య లేకున్నా సుప్రియ చిరంజీవి.!

జీవన్మృతి అవయవదానంతో పలువురికి పునర్జీవం..!

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాలలో వివాహిత అవయవ దానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు ప్రసరించి మానవత్వం చాటుకున్నది.వివరాల్లోకి వెళితే…మే 24న ఆదివారం జగిత్యాల పట్టణం హనుమాన్ వాడ కు చెందిన అక్కపెళ్లి ప్రవీణ్ సతీమణి సుప్రియ (25) అనే మహిళ స్కూటీ బండి నడిపించడం నేర్చుకునే క్రమంలో బండి పై నుండి ప్రమాదవశాత్తు పడి తలకు బలమైన గాయాలు కాగా, చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాదులోని యశోద హాస్పిటల్ కి తీసుకెళ్లాలని సూచించారు.గత మూడు రోజులుగా యశోద ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కానీ ఆమె ఆరోగ్యం కుదుటపడక పోగా మరింత విషమంగా మారి బ్రెయిన్ డెడ్ (జీవన్మృతురాలు) అయిందని తాను తిరిగి కోల్కోవడం కష్టతరమని డాక్టర్లు నిర్ధారణ చేశారు.గత మూడు రోజులుగా మృత్యువు తో పోరాడిన సుప్రియ గతరాత్రి తుది శ్వాస విడిచారు.దీనితో ఆమె భర్త అక్కపెళ్లి ప్రవీణ్, కుటుంబ సభ్యులు మహిళ అవయవాలను స్వచందంగా దానం చేయడానికి ముందుకు రావడంతో, ఆసుపత్రి వైద్యులు జీవన్ దాన్ ప్రతినిధులతో మాట్లాడి అవయవ దానం చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేశారు.దీనితో సుప్రియ శరీరంలోని ప్రధాన అవయవాలైన గుండె, ఊపిరితిత్తులు, కళ్ళు, మూత్రపిండాలు, కాలేయం ను జీవన్ దాన్ ప్రతినిధులు సేకరించినట్లు తెలిసింది.అనంతరం వారు మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఈ అవయవాలతో చాలా మంది జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసరింపజేసిందని సుప్రియను కొనియాడారు.ఆమెకు భర్త ఇద్దరు కూతుర్లు తేజశ్రీ (6), వైష్ణక (3) ఉన్నారు అతి చిన్న వయసులో ఇద్దరు పిల్లలని వీడి అనంత లోకాలకు వెళ్లిన సుప్రియ ఉదంతం తెలిసిన ప్రతి ఒక్కరు ఒక వైపు కొనియాడుతుంటే, మరోవైపు కుటుంబ సభ్యులు, ప్రాంత ప్రజలు చిన్న పిల్లలను చూసి కన్నీటి పర్యంతమౌతున్నారు.ఇక మరికొందరు పట్టణ ప్రముఖులు సుప్రియ చిరంజీవిగా మిగిలిపోయిందని ప్రశంసిస్తున్నారు.