navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 4:17 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య..

విద్య ద్వారానే సమాజ వికాసం

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదివారం పాల్గొన్నారు.విద్యా వారోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లాలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన మరియు ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు శారీరకంగా దృఢంగా ఉండడానికి నాణ్యమైన భోజనం అందించాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు.

వచ్చే విద్యా సంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం పూట అల్పాహార పథకం ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. విద్యతోనే సమాజ మార్పు అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారని వారి ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న విద్యార్థులు చదువులో రాణించి మంచి ఫలితాలు సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లాలో పదవ తరగతిలో 98. 88% ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే నాలుగో స్థానంలో నిలిచినందుకు జిల్లా విద్యాశాఖ అధికారులను జగిత్యాల జిల్లా ఉపాధ్యాయులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు నిధులతో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రూ. 8కోట్ల అంచనాతో ప్రతిపాదన లు పంపినట్లు మంత్రి తెలిపారు.జగిత్యాల జిల్లాలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందించి నగదు పురస్కారాలను మంత్రి అందజేశారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తో పాటు జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.