కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతినెల సంక్షేమ వసతి గృహాల నిధులు విడుదల..
మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి సన్మాన సభలో మంత్రి అడ్లూరి
నవగీతం,కరీంనగర్:
బలహీన వర్గాలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మున్నూరు కాపు సంఘం కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బాధ్యతలు చేపట్టి తొలిసారిగా కరీంనగర్ వచ్చిన సందర్భంగా కరీంనగర్ లోని ఇందిరా భవన్ లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు.ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని లక్ష్మణ్ అన్నారు. మంత్రి వర్గంలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగే విధంగా మంత్రులను నియమించడమే ఇందుకు నిదర్శనమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.బలహీన వర్గాలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి అడ్లూరి అన్నారు. బీసీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా 42 శాతం రిజర్వేషన్లు బిల్లును అసెంబ్లీలో ఆమోదించడంతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడం జరిగిందని మంత్రి అడ్లూరి గుర్తు చేశారు.

బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ వసతి గృహాల బిల్లులను తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతినెల రూ. 220కోట్లు చెల్లించే విధంగా చర్యలు తీసుకున్నామని మంత్రి అడ్లూరి వివరించారు బలహీన వర్గాల నేతగా బొమ్మ వెంకన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రత్యేక గుర్తింపు పొందారని ఆయన వారసునిగా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి రానున్న రోజుల్లో మరిన్ని మంచి పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
