కాంగ్రెస్ నేతలకు ఓరుగంటి చంద్రశేఖర్ హెచ్చరిక
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
జగిత్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రీయ విద్యాలయం అంశంపై మాట్లాడుతున్న ఒక బీసీ మహిళా నాయకురాలిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.ఇటీవల కలెక్టరేట్‌లో ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన “ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ విజయోత్సవం” కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా నిర్వహించబడిందని ఆరోపించారు. అధికారిక కార్యక్రమంలో ఎటువంటి పదవులు లేని కాంగ్రెస్ నాయకులు నందయ్య, గిరినాగభూషణం, బండ శంకర్‌లను అధికారులతో పాటు వేదికపై కూర్చోబెట్టడంపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నందయ్యకు స్కూల్‌లో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారో కూడా తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రశేఖర్ విమర్శించారు. గూగుల్‌లో చూసినా కేంద్రీయ విద్యాలయంలో 1000 నుంచి 1200 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారని తెలుస్తుందని అన్నారు. చదువు గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం “దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అయితే తమ నాయకురాలు భోగ శ్రావణి ఇక్కడి మీ ఎమ్మెల్యే సంజయ్ కుటుంబ సభ్యులు లాగా హైదరాబాద్ నుండి జగిత్యాల వచ్చి ఇక్కడ కాంట్రాక్టులు తీసుకొని చేయడం లేదని గుర్తు చేశారు.అసలు ఎమ్మెల్యే సంజయ్ వారానికి ఎన్నిసార్లు తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నారో అసలు వారి కార్యకర్తలకు తెలుస్తుందా లేదా అని ప్రశ్నించారు. శ్రావణి భర్త డాక్టర్ ప్రవీణ్ హైదరాబాదులో వృత్తిరీత్యా వైద్యులుగా పనిచేస్తున్నారని, అందుకోసం హైదరాబాద్ వెళితే ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే లాగా ప్రతి విషయంలో స్వార్థంగా ఆలోచించడం తమ నాయకురాలు శ్రావణికి తెలియదన్నారు. ఈ విషయం ఎమ్మెల్యే, ఎమ్మెల్యే అనుచరులు గుర్తుంచుకోవాలని హితువు పలికారు.అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాదరి అశోక్ కాంగ్రెస్ నాయకుల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య తొలిసారిగా స్వతంత్రంగా ప్రెస్‌మీట్ నిర్వహించడం సంతోషకరమేనని, కానీ ఒక బీసీ మహిళా నాయకురాలు ఎదగడాన్ని జీర్ణించుకోలేక ఎమ్మెల్యే ప్రేరేపణతో మాట్లాడటం బాధాకరమని అన్నారు.