నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం కోడిమ్యాల మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధిక తరుగు (కటింగ్) విధింపుపై రైతులు తీవ్ర ఆందోళనకు దిగారు. ధాన్యం తూకంలో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ కొనుగోలు కేంద్రాల వద్ద నిరసన చేపట్టారు. వర్షాకాలంలో మాత్రమే ధాన్యంలో లోపాలు ఉన్నపుడు తరుగు విధించాలని నిబంధనలు ఉన్నప్పటికీ, ఎండాకాల పంటకు కూడా ప్రతి క్వింటాల్‌కు 2–3 కిలోల వరకు తరుగు తీస్తుండటం అన్యాయమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ విషయంపై అధికారులను ప్రశ్నించగా, “లోడ్లు మిల్లర్ల వద్దకు వెళ్లిన తర్వాత ఎంత తరుగు అవుతుందో చెప్తాం” అనే నిర్లక్ష్య సమాధానం రావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం “రైతే రాజు” అంటూ చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, ప్రాక్టికల్‌గా మాత్రం తరుగు పేరుతో రైతులకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం 41 కేజీల ధాన్యాన్ని తూకం వేస్తూ ప్రతి క్వింటాల్‌కు 2–3 కిలోల వరకు తరుగు తీస్తున్నారని అన్నారు. ధాన్యంలో లోపాలు ఉంటేనే తరుగు విధించాలనే ప్రభుత్వ మార్గదర్శకాలను అమలు చేయకుండా కావాలనే అధికంగా తరుగు వేస్తున్నారని ఆరోపించారు. A గ్రేడ్‌లో కాకపోతే సాధారణ గ్రేడ్‌లో కొనుగోలు చేయాలని, కానీ అధిక తరుగు మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేశారు.ధాన్యం మిల్లులకు వెళ్లిన తర్వాత ఎంత తరుగు విధించినా భరించాల్సిందేనని, తిరిగి తీసుకొస్తే అన్‌లోడింగ్ ఖర్చులు కూడా రైతులపైనే పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ఈ విధానం తీవ్ర నష్టం కలిగిస్తోందని, పరిస్థితి మారకపోతే ధాన్యం అమ్మడం కంటే కాల్చేసుకోవడానికైనా సిద్ధమని హెచ్చరించారు.రెండు రోజుల్లో పాత విధానంలో తూకం వేయకపోతే పూడూరు ప్రధాన రహదారి వద్ద రాస్తారోకో చేపడతామని రైతులు హెచ్చరించారు.