navageetam.com
Newspaper Banner
Date of Publish : 08 May 2026, 8:22 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి — రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు మరియు ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…కొనుగోలు కేంద్రంలో రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు విధానం, తేమ శాతం పరీక్షలు, తూకం ప్రక్రియ, నిల్వలు, రవాణా తదితర అంశాలపై అధికారులు అందిస్తున్న సేవలను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.రైతులు తీసుకువచ్చే మొక్కజొన్న కు సరైన ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటిస్తూ రైతులకు సమయానికి చెల్లింపులు జరగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రకృతి రైతులపై కన్నెర్ర చేస్తే ప్రజా ప్రభుత్వం కడుపులో పెట్టుకుని భరోసా కల్పిస్తుందని అన్నారు.వర్షం ఏ సమయంలో వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉన్నందున రైతులు, నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అకాల వర్షాల పట్ల రైతుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు.జిల్లాలో అందరికి అందుబాటులో ఉంటానని ఏవైనా సమస్యలుంటే వెంటనే దృష్టికి తీసుకురావాలని అన్నారు.ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ…రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.

రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని కోరారు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటూ రైతులకు భరోసా కల్పిస్తానని అన్నారు. అదేవిధంగా కల్లాల్లో కుప్పలపై రాత్రి సమయాల్లో టార్ఫాలిన్ కప్పి ఉంచాలని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ..జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, నీడ, తూకం యంత్రాలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. అకాల వర్షాల వల్ల ఏర్పడిన రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తడిసిన ధాన్యం తగిన విధంగా ఆరబెట్టాలని అన్నారు. టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాష్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ లు మరియు సభ్యులు, మార్కెట్ కమిటీ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్ లు, కొనుగోలు కేంద్ర సిబ్బంది, రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.