ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
జిల్లాలోని చలిగల్‌లో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని గురువారం జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, డైరెక్టర్ జనరల్ వాలంటరీ అనితతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చలిగల్‌లో నిర్మించనున్న పాఠశాలల కోసం అవసరమైన మౌలిక వసతులు, భవన నిర్మాణం, రహదారి సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా అన్ని సదుపాయాలతో ఆధునిక విద్యాసంస్థలను నిర్మించాలని అధికారులకు సూచించారు.జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాఠశాల నిర్మాణానికి అవసరమైన అన్ని సదుపాయాలను సమగ్ర ప్రణాళికతో అమలు చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, జగిత్యాల రూరల్ తహసీల్దార్ హకీమ్, సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
