navageetam.com
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 7:09 pm Digital Edition : NAVAGEETAM DAILY NEWS

శభాష్ లతీఫ్ బాయ్ – మాజీ ఎంపీ నామ అభినందనలు

నవగీతం వైరా ప్రతినిధి:

గర్భిణీ స్త్రీల టెస్ట్‌ల కోసం అలాగే డెలివరీ సమయాల్లో ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్లి హాస్పిటల్‌కు చేర్చుతున్న లతీఫ్‌ను బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు శభాష్ లతీఫ్ బాయ్ అంటూ అభినందించారు. మారుమూల గ్రామాల్లో బస్సు సౌకర్యం లేని ప్రాంతాల్లో ఆయన చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నామ తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సమయంలో కూడా ఖర్చును పట్టించుకోకుండా, తన పంక్చర్ షాప్‌ను నడుపుతూ అవసరమైన వేళల్లో సేవలు అందించడం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. గత ఆరు సంవత్సరాలుగా నామ స్ఫూర్తితోనే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు లతీఫ్ నామ కు తెలిపారు. నామ ట్రస్ట్ ద్వారా వైరా పట్టణం, రూరల్ మండలానికి చెందిన ఆటో డ్రైవర్లకు ఖాకీ చొక్కాలు అందించడం, నామ తండ్రి ముత్తయ్య పేరుతో గ్రామాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, బోర్లు వేయించడం, ఆరోగ్య సేవలు వంటి సేవ కార్యక్రమాలను లతీఫ్ గుర్తు చేసుకున్నారు. అలాగే 17వ లోక్‌సభ కాలంలో నామ తన నిధుల ద్వారా వైరాకు అందించిన అంబులెన్స్ అత్యవసర సమయాల్లో ఎంతో ఉపయోగపడుతోందని, కోవిడ్ సమయంలో కూడా తాను తన ఆటోతో సేవలు అందించానని వైరా మండలం పరిసర గ్రామాలైన స్టేజి పినపాక, సిరిపురం, కే.జి. సిరిపురం, పూసలపాడు, గౌండ్లపాలెం, నారపనేనిపల్లి, విప్పలమడక, లింగనపాలెం, గరికపాడు, దాచాపురం, సన్నాల లక్ష్మీపురం, ముసలిమడుగు, పుణ్యపురం, పాత పినపాక తదితర గ్రామాల నుండి వైరాకు గర్భిణీలను 24 గంటలు ఉచితంగా తన ఆటోలో తీసుకెళ్తున్నాని లతీఫ్ తెలిపారు. ఈ సందర్భంగా నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ, లతీఫ్ లాంటి సేవాభావం కలిగిన వ్యక్తులు పెరగాలని, భవిష్యత్తులో కూడా లతీఫ్ తన సేవలను మరింత విస్తరించి, మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.