జగిత్యాల కలెక్టరేట్‌లో పీఐఓలు, ఏపీఐఓలకు ఆర్‌టీఐ అవగాహన సదస్సు
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తూ పారదర్శకత, జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం–2005పై పీఐఓలు, ఏపీఐఓలు మరియు వివిధ శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డితో పాటు రాష్ట్ర సమాచార కమిషనర్లు పీ.వీ. శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పూల మొక్క అందించి అతిథులను స్వాగతించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమాచారం ప్రజలకు అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని, ప్రజలు కోరిన సమాచారాన్ని అందించడం అధికారుల బాధ్యత అని తెలిపారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కల్పించబడిందని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న సమాచారం ప్రజలకే సంబంధించినదని, దానిని వెల్లడించడంలో అలసత్వం తగదన్నారు. సమాచార హక్కు చట్టంలోని షెడ్యూళ్లు, చాప్టర్లు, సెక్షన్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు అవగాహన పొందేలా వివరించారు. థర్డ్ పార్టీ సమాచారం, వ్యక్తిగత సమాచారం, ఇవ్వవలసిన మరియు ఇవ్వకూడని సమాచారంపై సవివరంగా చర్చించారు. సెక్షన్ 4(1)(బి) ప్రకారం ప్రజలకు స్వచ్ఛందంగా సమాచారం అందించే విధంగా కార్యాలయాలు సిద్ధంగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా సమాచారం అందించామని, మరో 15 వేల అప్పీలు రాష్ట్ర సమాచార కమిషన్‌కు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 20 జిల్లాల్లో పర్యటించి, సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు. సమాచార కమిషనర్ పీ.వీ. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం కింద వచ్చే దరఖాస్తులను అధికారులు జాగ్రత్తగా పరిశీలించి చట్టబద్ధంగా స్పందించాలని సూచించారు. దరఖాస్తుదారులు కోరిన మేరకు రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని అందించడంలో అపోహలు, అనుమానాలకు తావివ్వవద్దన్నారు. రాష్ట్ర సమాచార కమిషనర్ దేశాల భూపాల్ మాట్లాడుతూ ప్రపంచంలో 1766లోనే స్వీడన్‌లో సమాచార హక్కు చట్టం అమలు ప్రారంభమైందని, భారతదేశంలో 2005లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఆర్‌టీఐ అమలులో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉందని, మరింత సమర్థవంతంగా అమలు చేసి దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ఉద్యోగుల్లో బాధ్యతాయుత వైఖరి, నైతిక విలువలు పెంపొందించే కీలక చట్టమని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి విధుల పట్ల బాధ్యతగా వ్యవహరించి, ఫిర్యాదులు మరియు సమాచార అభ్యర్థనలకు సకాలంలో స్పందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు బి.ఎస్. లత, బి. రాజ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, అప్పీలేట్ అథారిటీలు, పీఐఓలు, ఏపీఐఓలు మరియు ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
