పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుంది
సీబీఎస్సీ విద్యను విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతోంది
నవగీతం, జగిత్యాల ప్రతినిది:
ఇప్పటికైనా స్వార్థ రాజకీయాలు చేయడం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మానుకోవాలి.. పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుంది.. సీబీఎస్సీ విద్యను విద్యార్థులకు దూరం చేసే కుట్ర జరుగుతోంది.. ఎంపీ అరవింద్ పై అనవసరపు విమర్శలు చేస్తే ఊరుకోము.. దమ్ముంటే పది ఎకరాల స్థలం వెంటనే కేటాయించాలి.. అని జగిత్యాల నియోజకవర్గ బీజేపీ ఇంచార్జీ డాక్టర్ భోగ శ్రావణి ఫైర్ అయ్యారు.గత రెండు రోజుల క్రితం ఓ సమావేశంలో డాక్టర్ సంజయ్ కేంద్ర విద్యాలయాల ఏర్పాటు పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఆమె కౌంటర్ ఇచ్చారు.తాము నిజాలు చెప్పినప్పటికీ జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తాము దీక్ష చేస్తున్న విషయం గురించి మాట్లాడితే అది పక్కనపెట్టి తమను ఉద్దేశపూర్వకంగానే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్లు తాము వాస్తవాలు మాట్లాడితే అది పక్కనపెట్టి పొంతన లేకుండా మాట్లాడడం ఎమ్మెల్యే సంజయ్ కే చెందుతుందన్నారు.
జగిత్యాలలో ఉన్న అటూ ఇటూ కానీ నాయకులు సైతం తాము చెప్పిన నిజాన్ని ఒప్పుకోవడం లేదని విమర్శించారు. వారి యొక్క స్వార్థ రాజకీయాల కోసమే, వారు భూములు, జాగలు మరింత పెంచుకోవడానికే దాదాపు ఒకటిన్నర సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్నారన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న విద్యా సంస్థలకు మాత్రమే స్థలాలు ఇస్తామని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే విద్యాసంస్థలకు స్థలం లేదని సాక్షాత్తు ఎమ్మెల్యే అనడం హాస్యస్పదంగా ఉందన్నారు.
ఇక్కడ పాఠశాల ఏర్పాటు జరిగితే ఎక్కడ కేంద్ర ప్రభుత్వానికి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు, బీజేపీ నేతలకు మంచి పేరు వస్తుందోనని భయంతో ఇక్కడి ఎమ్మెల్యే ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఇచ్చిన ప్రెస్ మీట్ చూస్తే అసలు ఇక్కడ కేంద్ర విద్యాలయం ఎందుకు మంజూర అయిందోనని బాధతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు.
కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే మంజూరు చేస్తున్న పాఠశాలలే మంచివని, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే పాఠశాలలు అసలు తమకు అక్కర్లేదన్నట్లుగా ఎమ్మెల్యే తీరు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కేంద్ర విద్యాలయ ఏర్పాటను అడ్డుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరి రాతపూర్వకంగా తమ నియోజకవర్గానికి కేంద్ర విద్యాలయం అవసరం లేదని స్పష్టంగా రాసివ్వాలని సవాల్ విసిరారు.
తమకు నియోజకవర్గ ప్రజలు, విద్యార్థుల సంక్షేమం ముఖ్యం కాబట్టే ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయించాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు దిగుతున్నామని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందాలని తమ తాపత్రయ పడుతుంటే దీని అడ్డుకోవడానికి ఎమ్మెల్యే ప్రయత్నిస్తుండడం సరికాదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలకు 25 ఎకరాల అయినా సరే కేటాయించిన ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పాఠశాలకు మాత్రం 10 ఎకరాల స్థలం కేటాయించలేకపోతున్నారని విమర్శించారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ కేవలం తన బినామీలను అడ్డుపెట్టుకొని వారి స్థలాల్లో మాత్రమే పాఠశాల ఏర్పాటుకు ఎమ్మెల్యే ముందుంటారని, కేంద్ర విద్యాలయ ఏర్పాటుకు మాత్రం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.పదేళ్లుగా బీజేపీ పార్టీలో ఉన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఒక్క అవినీతి మచ్చా అయినా ఉందా అని, ఉంటే రుజువు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కు తెలిపారు. ఎప్పుడూ కాంట్రాక్టర్ల వద్ద కమిషన్ల కొరకు కక్కుర్తి పడే ఆయన తమ ఎంపీపై మాట్లాడే అర్హత లేదన్నారు.
అసలు నియోజకవర్గానికి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఏం చేశారని విమర్శలు చేసేముందు నియోజకవర్గానికి రూ. 60 కోట్లు, రాయికల్ మున్సిపల్కు రూ. 15 కోట్లు మంజూరు చేయించిన విషయం మర్చిపోయారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల నుండి అభివృద్ధి పనులు ప్రారంభించే సమయంలో ప్రోటోకాల్ ప్రకారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను పిలవాల్సి ఉన్నప్పటికీ ఆయనను పిలవకుండానే పనులను ప్రారంభించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం చేయడం కేవలం ఎంపీ అరవింద్ కే దక్కుతుందన్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.
ఇప్పటికైనా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అనవసరకు విమర్శలు మానుకోవాలని, లేదంటే నియోజకవర్గం ఒకరోజు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కాగా ఇప్పటికైనా 15 వరకూ ఎంపీ అర్వింద్ సమయం ఇచ్చారని, అయినా ఎమ్మెల్యే, మంత్రి, ప్రభుత్వం నుంచి చలనం లేదన్నారు. ఈ నెల 18న ధర్మపురి అర్వింద్ జగిత్యాల ఆర్డివో కార్యాలయం ఎదుట ధర్మ దీక్ష పేరుతో దీక్ష చేపడుతారని, అందరు ధర్మస్థలికి పెద్దగా ఎత్తున సోమవారం 9 గంటలకు వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరెన్ని కుట్రలు చేసిన ధర్మ దీక్ష ఆగదని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, అర్బన్ మండల అధ్యక్షులు రామ్ రెడ్డి, మహిళ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పిండేరు భానుప్రియ, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు దూరిశెట్టి మమత, ప్రధాన కార్యదర్శులు ఆముదరాజు, సిరికొండ రాజన్న, పూదరి శ్రీనివాస్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జంబర్తి దివాకర్, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ సుంచు సురేష్, సిరిపురం శ్రీనివాస్, పవన్ సింగ్, గదాసు రాజేందర్, ఇట్యాల రాము, మహిళా మోర్చా నాయకురాలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
