navageetam.com
Newspaper Banner
Date of Publish : 18 June 2026, 6:24 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

ప్రభుత్వ బడిలో కుమారునికి అడ్మిషన్.. గ్రామానికి స్ఫూర్తిగా సర్పంచ్ నిర్ణయం….

కోరుట్ల రూరల్, జూన్ 17,(నవగీతం ప్రతినిధి):

గ్రామ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని గ్రామ సర్పంచ్ దోడ రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ కుమారుడు ధోడ రత్నాకర్ రెడ్డి ఎం.పి.పి.ఎస్. ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతిలో చేర్పించిన సందర్భంగా ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ నిర్ణయం కేవలం తమ కుమారుడు అడ్మిషన్ కోసమే కాకుండా, గ్రామ ప్రభుత్వ పాఠశాలపై నమ్మకాన్ని పెంపొందించి ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నదని తెలిపారు. గ్రామంలోని మరింత మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ప్రస్తుతం పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను గ్రామ ప్రభుత్వ పాఠశాలకు పంపేందుకు ముందుకు రావడం సంతోషకరమైన పరిణామమని పేర్కొన్నారు. పాఠశాలలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని విమర్శించడం కంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు కలిసి పరిష్కరించే దిశగా కృషి చేయాలని సూచించారు.పిల్లల సంఖ్య తగ్గుతూ పోతే భవిష్యత్తులో గ్రామ ప్రభుత్వ పాఠశాల మూతపడే ప్రమాదం ఉందని, అది గ్రామ భవిష్యత్తుకు పెద్ద నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. గత పన్నెండు సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతో మంది విద్యార్థులు నవోదయ పాఠశాలలో సీట్లు సాధించారు. గ్రామ పాఠశాల అభివృద్ధి మనందరి బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు. “మన బడి – మన బాధ్యత, మన పిల్లలు – మన భవిష్యత్తు” అనే నినాదంతో గ్రామ ప్రజలందరూ ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి పిలుపునిచ్చారు.

నోట్ బుక్స్ పంపిణీ….

2026-27 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ప్రాథమికోన్నత పాఠశాల, విద్యార్థిని, విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న పుస్తకాలు , నోట్ బుక్ లను గ్రామ సర్పంచ్ రంజిత్ రెడ్డి , పంచాయతి కార్యదర్శి సల్మా సుల్తానా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ పంపిణీ చేశారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.