navageetam.com
Newspaper Banner
Date of Publish : 17 June 2026, 9:39 am Digital Edition : NAVAGEETAM DAILY NEWS

మూతపడిన వెంకట్రావుపేట ప్రభుత్వ పాఠశాలకు పునర్జీవం

22 మంది విద్యార్థులతో ఘనంగా పునఃప్రారంభం

నవగీతం, మల్లాపూర్  ప్రతినిధి:

గత మూడు సంవత్సరాలుగా విద్యార్థుల నమోదు లేక మూతపడిన ఎంపీపీఎస్ వెంకట్రావుపేట పాఠశాల మంగళవారం ఘనంగా పునఃప్రారంభమైంది.గ్రామ సర్పంచ్ కానుముల వెంకటేష్ చొరవ,గ్రామ ప్రజల సహకారంతో పాఠశాల తిరిగి విద్యా సేవలను ప్రారంభించింది.పాఠశాలను మండల విద్యాధికారి కేతిరి దామోదర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలలో 22 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. అలాగే పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా వి. జ్ఞానేశ్వరి నియమించారు. నేటి నుండి ఎంపీపీఎస్ వెంకట్రావుపేట పాఠశాల అధికారికంగా విద్యా కార్యక్రమాలను నిర్వహించనుంది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సర్పంచ్ కానుముల వెంకటేష్ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు,విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మండల విద్యాధికారి . కేతిరి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ,ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతోందని,అర్హత కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందిస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అందరూ సహకరించాలని కోరారు.సర్పంచ్ కానుముల వెంకటేష్ మాట్లాడుతూ…గ్రామంలో పాఠశాల గత మూడు సంవత్సరాలుగా మూతపడటం తనను ఎంతో బాధించిందని పేర్కొన్నారు. పాఠశాలను తిరిగి ప్రారంభించాలనే సంకల్పంతో మండల విద్యాధికారి ని సంప్రదించగా,ఆయన సంపూర్ణ సహకారం అందించి పాఠశాల పునఃప్రారంభానికి కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున మండల విద్యాధికారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే గ్రామంలోని ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలోనే చేరేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి వేల్పుల సురేష్ ఉప సర్పంచ్ తోట గంగా రెడ్డి ప్రధానోపాధ్యాయులు దత్తాత్రి ,శ్రీ హరిబాబు జ్ఞానేశ్వరి,వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు,విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.