నవగీతం,కొడిమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) కార్యకర్తల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అశోక్‌రావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాధాన్యతను వివరించారు. సూర్య భగవానుడు ధనుస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతిగా పిలుస్తారని తెలిపారు. ఈ రోజు నుంచి రాత్రి సమయం తగ్గి పగటి కాలం పెరుగుతుందని, ఇది వెలుగుకు, చైతన్యానికి ప్రతీకగా భావించాలన్నారు.మన పెద్దలు పండుగలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా ప్రకృతిని ఆరాధించే విధంగా రూపొందించారని అన్నారు. ప్రకృతి బాగుంటేనే మానవ మనుగడ సాధ్యమని, సనాతన ధర్మం ప్రకారం చెట్లను పెంచడం, మూగ జీవాలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అలా చేసినప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమై, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి అనేది కేవలం సంబరాల పండుగ మాత్రమే కాదని, ప్రకృతి పట్ల మనకున్న కృతజ్ఞతను వ్యక్తపరచే పండుగ అని అన్నారు.ఈ సందర్భంగా ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ మకర సంక్రాంతి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త వెలుగు నింపాలని ఆకాంక్షించారు.“చెరుకులోని తియ్యదనం,పాలలోని తెల్లదనం,గాలిపటంలోని రంగుల అందం, మీ జీవితాల్లో ఆనందం నింపాలి” అని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అశోక్‌రావు, గంగాచారి, మంచాల శ్రీనివాస్, బొమ్మ సురేష్, చెన్న దేవేందర్, చుక్క శ్రీనివాస్, ఆదిరెడ్డి, వడ్లకొండ హనుమండ్లు, బల్ల చిన్న అంజయ్య, నాంపల్లి రామచంద్రం, నాగరాజు,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

