రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్న గౌడ సంఘాలు
పెద్దపల్లి గౌడ జేఏసీ డిమాండ్
నవగీతం,పెద్దపల్లి:
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో గౌడ సామాజిక వర్గానికి రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని పెద్దపల్లి నియోజకవర్గ గౌడ సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.ఆదివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో గౌడ సంఘం జేఏసీ నియోజకవర్గ అధ్యక్షులు బాలసాని వెంకటేశం అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గౌడ సంఘాల జేఏసీ నాయకులు బొబ్బిలి రాజమౌళి గౌడ్,పడాల కొమరయ్య గౌడ్,బాలసాని వెంకటేష్ గౌడ్,పడాల సతీష్ గౌడ్ మాట్లాడుతూ పెద్దపల్లి మున్సిపాలిటీలో తమ సామాజిక వర్గానికి 5 వేల నుండి 10 వేల వరకు ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీలు తమను కేవలం ఓటు బ్యాంకుగా మరియు జెండాలు మోసే కార్యకర్తలుగా మాత్రమే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క గౌడ అభ్యర్థికి కూడా కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడం శోచనీయమని,ఈ వివక్షను ఇకపై భరించే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు.పెద్దపల్లి మున్సిపాలిటీలోని 36 వార్డులలో కనీసం 3 నుండి 4 వార్డులను గౌడ సామాజిక వర్గానికి కేటాయించాలని కాంగ్రెస్,బీఆర్ఎస్, బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలను వారు డిమాండ్ చేశారు.ఏ పార్టీ అయితే తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిచ్చి టికెట్లు కేటాయిస్తుందో,ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం తమ సంఘం శ్రేణులన్నీ ఏకతాటిపై నిలిచి సంపూర్ణంగా మద్దతు తెలుపుతాయని ప్రకటించారు.గతంలో బాలసాని సురేష్ గౌడ్ వంటి నాయకులను భారీ మెజారిటీతో గెలిపించుకున్న చరిత్ర తమకు ఉందని గుర్తు చేస్తూ,రాజకీయ పార్టీలు తమ చిన్నచూపును వీడాలని కోరారు.ఒకవేళ తమ డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే,రాబోయే ఎన్నికల్లో గౌడల ఐక్యతను మరియు తమ సత్తా ఏంటో రాజకీయ పార్టీలకు రుచి చూపిస్తామని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు హెచ్చరించారు.ఈ సమావేశంలో గుర్రం సదానందం గౌడ్,బండారి సునీల్ గౌడ్,బండారి సుమన్ గౌడ్,బండి నరేందర్ గౌడ్, అడ్డిగుంట శ్రీనివాస్ గౌడ్, సతీష్ గౌడ్,వెంకటేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితులు పాల్గొన్నారు.

