Thursday, February 26, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్స‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతం.

స‌మిష్టి కృషితో ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతం.

📰 Generate e-Paper Clip

వాహ‌న సేవ‌ల‌ను వీక్షించిన దాదాపు 3.45ల‌క్ష‌ల మందికి పైగా భ‌క్తులు

గ్యాలరీల్లోని భ‌క్తుల‌కు విరివిగా అన్న ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ

ఏపీఎస్ఆర్టీసీ అద్భుత‌మైన సేవ‌లు

టీటీడీ స‌దుపాయాల‌పై భ‌క్తుల నుండి విశేష‌స్థాయిలో ప్ర‌శంస‌లు

టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్‌

నవగీతం, తిరుపతి

రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతం చేసినట్లుగానే ఈ ఏడాది జనవరి 25వ తేదిన రథ సప్తమి వేడుకలను కూడా టీటీడీ, జిల్లా, పోలీసు యంత్రాంగం, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకుల స‌మిష్టి కృషితో అంగరంగవైభవంగా నిర్వహించామ‌ని టీటీడీ ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ తెలియ‌జేశారు. ర‌థ స‌ప్త‌మి వేడుక‌లు విజ‌య‌వంతమ‌వ్వ‌డంతో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఆయ‌న అద‌న‌పు ఈవో సి.హెచ్‌.వెంక‌య్య చౌద‌రితో క‌లిసి తిరుమ‌ల‌లోని అన్నమ‌య్య భ‌వ‌న్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమలలో భక్తులకు టీటీడీ కల్పిస్తున్న సదుపాయాలను దృష్టిలో ఉంచుకుని గతంలో ఎన్నడూలేని విధంగా భక్తులు తిరుమలకు వస్తున్నారని చెప్పారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలతో మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రథ సప్తమి రోజున నిర్విరామంగా కష్టపడిన అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ధన్యవాదాలు తెలిపారు.

అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మాట్లాడుతూ రథ సప్తమి సందర్భంగా భక్తుల నుండి వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయాలు సేకరించడం జరిగిందని, భక్తులందరూ కూడా టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఉత్తరమాడ వీధిలో ఒక భక్తుడు కూడా సదుపాయాలు బాగాలేవని చెప్పకపోవడం టీటీడీ కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. పలువురు భక్తులు గ్యాలరీల్లో అదనపు మరుగుదొడ్లు, స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సూచించారని అందుకు తగిన విధంగా చర్యలు చేపడతామని తెలియజేశారు.

స‌మావేశంలోని ముఖ్యాంశాలు

గతంలో ఎన్నడూలేనివిధంగా ఈ ఏడాది రికార్డుస్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలు వీక్షణ‌.

అన్ని విభాగాల సమన్వయంతో రద్దీ నిర్వహణ, భక్తులకు మెరుగైన సేవలు అందించడంలో సఫలీకృతం.

ర‌థ స‌ప్తమి రోజున గ్యాల‌రీల్లోని భ‌క్తులంద‌రికీ ఉద‌యం నుండి రాత్రి వ‌ర‌కు విరివిగా అన్న ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ.

సొజ్జ‌ రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, సాంబార్ రైస్, టమోటా రైస్, పులిహోర, చక్కెర పొంగలి, వేడి బాదం పాలు, కాఫీ, పాలు, మజ్జిగ, సుండలు, బిస్కెట్లను భక్తులకు పంపిణీ.

9.42 లక్షల మందికి అన్న ప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి వాటర్ బాటిళ్లు పంపిణీ.

వివిధ విభాగాలతో పాటు మాడ వీధులలో భ‌క్తుల‌కు అన్న‌ప్ర‌సాదాలు, పానీయాలు పంపిణీ చేసేందుకు దాదాపు 220 మంది శ్రీ‌వారి సేవ‌కుల సేవ‌లు వినియోగం.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా, పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుని 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలు వినియోగం.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీకి మరియు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

గతంలో ఎన్నడూలేని విధంగా 3.56 లక్షల గ్యాడ్జెట్స్, బ్యాగులు లగేజీ కేంద్రాల్లో డిపాజిట్.ఇది గత ఏడాది కంటే 73 శాతం అధికం.

ప‌బ్లిక్ అడ్రెస్ సిస్టం ద్వారా భ‌క్తులకు అవ‌స‌ర‌మై స‌మాచారాన్ని ఎప్పటికప్పుడు వివిధ భాష‌ల్లో అంద‌జేత‌.

భక్తులను తిరుమలకు చేరవేయడంలో ఏపీఎస్ ఆర్టీసీ అద్భుతమైన సేవలు. తిరుపతి నుండి తిరుమలకు 1932 ట్రిప్పుల ద్వారా 60425 మంది భక్తులు ప్రయాణించగా, తిరుమల నుండి తిరుపతికి 1942 ట్రిప్పుల ద్వారా 82,241 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుపతికి చేరవేత‌.

రథ సప్తమి సందర్భంగా తిరుమలలో చేసిన విద్యుత్, పుష్పాలంకరణలు అద్భుతంగా ఉన్నాయని భక్తుల నుండి విశేషస్థాయిలో ప్రశంసలు.

శ్రీవారి వాహ‌న‌సేవ‌ల ఎదుట భక్తులను ఆక‌ట్టుకునేలా 1000 క‌ళాకారులు ప్ర‌ద‌ర్శ‌న‌లు. భక్తుల సౌకర్యార్థం మాడ వీధుల్లో మెరుగైన పారిశుద్ధ్య సేవలు. గ్యాలరీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పారిశుద్ధ్యం లోపం తలెత్తకుండా చర్యలు. ఇందుకుగాను అదనంగా 590 పారిశుద్ధ్య సిబ్బంది సేవలు వినియోగం.

అత్యవసర వైద్య సహాయం అవసరమైన భక్తులకు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్సుల ద్వారా వైద్య సేవలు. రథ సప్తమి రోజున 23 వేల మంది భక్తులకు వైద్య సేవలు, 94 మందిని అంబులెన్సుల ద్వారా తిరుపతిలోని ఆస్పత్రులకు తరలింపు.

ఎస్వీబీసీ చానెల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు వాహన సేవలను వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం. రథ సప్తమి వేడుకలను విజయవంతం చేసేందుకు సహకరించిన టీటీడీ, జిల్లా, పోలీసు, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకులు, విశేష ప్రచారం కల్పించిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో టీటీడీ సీవీఎస్వో ముర‌ళీకృష్ణ‌, తిరుప‌తి ఎస్పీ సుబ్బ‌రాయుడు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular