మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి
మెట్ పల్లిలో యువతకు ఉద్యోగ నియామక పత్రాల అందజేత
నవగీతం, జగిత్యాల ప్రతినిధి :
ఐక్యూ మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ అన్నారు. మెట్ పల్లి ఐక్యూ మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈనెల 22న మెట్ పల్లిలో చేపట్టిన ఓపెన్ ఉద్యోగ మేళకు హాజరై ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించిన పలువురు యువతకు మంగళవారం నియామక పత్రాల అందజేత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యువతకు నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుత ఆధునిక యుగంలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడానికి మెట్ పల్లి ఐక్యూ మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు ఎండీ యాసీన్, ఎండీ బిస్మిల్లా ముందుకు రావడం అభినందనీయం అన్నారు. భవిష్యత్తులో మరింత మంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలని సూచించారు. కాగా ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ గా మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ గా ఓంకారి నవీన్ కుమార్ లు విజయం సాధించగా మెట్ పల్లి ఐక్యూ మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు ఎండీ యాసీన్, ఎండీ బిస్మిల్లా ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు కృషి చేస్తున్న సందర్భంగా యాసిన్, బిస్మిల్లాలను మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి ఐక్యూ మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు ఎండీ యాసీన్, ఎండీ బిస్మిల్లా, అధ్యాపకులు పులిమామిడి ప్రవీణ్ కుమార్ (ఎంఏ ఇంగ్లీష్), నాయకులు మైలారపు రాంబాబు, కోట కిరణ్ కుమార్ (ప్రముఖ సామాజిక సేవకులు), సిబ్బంది డీ. మనోహర్, బీ. రాజేందర్, బీ. అఖిల, ఎం వేణు, బీ. మాధవి, పలువురు యువత పాల్గొన్నారు.

