Saturday, February 28, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలకెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

కెజిబివి పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

📰 Generate e-Paper Clip

నవగీతం, జగిత్యాల ప్రతినిధి:

పిఎం పోషణ్’ తనిఖీ లో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ (బాలికల) విద్యాలయం (కేజీబీవీ) ను ఆకస్మికంగా సందర్శించారు.ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు అందిస్తున్న కామన్ మెనూ ప్రకారం వండుతున్న ఆహారాన్ని పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలు తదితర అంశాలను సమీక్షించారు. స్టోర్ రూమ్‌లో ఉన్న బియ్యం, పప్పులు, కూరగాయలు మరియు ఇతర సరుకుల సామగ్రిని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.

అనంతరం పదవ తరగతి ఫలితాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచిస్తూ, పదో తరగతి విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం తీసుకుంటున్న ప్రణాళికలపై అక్కడి స్పెషల్ ఆఫీసర్లు మరియు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక తరగతులు, రివిజన్ ప్లాన్, మోడల్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మెస్ కమిటీ వ్యవహారాలపై వివరాలు తెలుసుకుని, కమిటీ సమావేశాలు నియమితంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి పాఠశాలలో కల్పిస్తున్న అన్ని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠ్యంశాల్లోని పలు ప్రశ్నలు అడిగి వారి చదువు, లక్ష్యాలు, ఆశయాల గురించి తెలుసుకుని ప్రోత్సహించారు. చదువును ఇష్టంతో చదివి భవిష్యత్ లో ఉన్నత స్థాయికి చేరుకొని మీ తల్లిదండ్రులకు, మీ పాఠశాలకు జిల్లాకు మరియు రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు.

పిఎం పోషణ్ పథకం లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం, వసతి సదుపాయాలపై నేరుగా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము, తహసీల్దార్ రామ్మోహన్, కెజిబివి ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular