బోనాల పండుగ వైభవం
నవగీతం, కొడిమ్యాల
కొడిమ్యాల మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, బోనాల పండుగ, కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడగా, మండలం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, మొక్కులు చెల్లించుకున్నారు.

ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి, ఎమ్మెల్యేలకు కొడిమ్యాల గౌడ కుల సంఘ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.స్థానిక గౌడ సంఘం సభ్యుల ఆహ్వానం మేరకు మంత్రి ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి విచ్చేసి బోనాల పండుగలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు సమర్పించి ప్రాంత ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు. ఈ ప్రాంతమంతా అమ్మవారి కృపతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

అమ్మవారి పట్నాలు గ్రామీణ సంప్రదాయాల నడుమ అద్భుతంగా కొనసాగాయి. మహిళలు అలంకరించిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని భక్తి గీతాలు ఆలపించారు. డప్పుల నాదం, మంగళవాయిద్యాల మధ్య కళ్యాణ మహోత్సవం ఆధ్యాత్మికంగా జరిగింది. భక్తులు “జై ఎల్లమ్మ తల్లి” నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, ఇలాంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సాంప్రదాయ పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు. మొత్తం మీద శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పట్నాలు, బోనాల పండుగ, కళ్యాణ మహోత్సవం భక్తుల సందడి, ఆధ్యాత్మిక ఉత్సాహంతో ఘనవిజయంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

