13 మంది విద్యార్థుల ఎంపిక
నవగీతం, కొడిమ్యాల:
కొడిమ్యాల మండలం నాచుపల్లి లోని జవహర్ లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్‌టీయూ హెచ్) యూనివర్సిటీ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 13 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రముఖ డేటా సెంటర్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో ఈ విద్యార్థులు ప్రతిభ చాటారు.ఎంపికైన వారిలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ) విభాగానికి చెందిన 12 మంది, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఒక విద్యార్థి ఉన్నారు. వీరికి సంవత్సరానికి రూ. 5.5 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు వేతనం లభించనున్నట్లు కళాశాల వర్గాలు వెల్లడించాయి.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నర్సింహ, వైస్ ప్రిన్సిపాల్ డా. కె. శ్రీనివాస్ ఎంపికైన విద్యార్థులను అభినందించారు.రానున్న రోజుల్లో మరిన్ని ప్రాంగణ నియామకాలు నిర్వహించి విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ప్రాంగణ నియామకాల అధికారి డా. బి.సతీష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు శిక్షణా కార్యక్రమాలను సమర్థంగా వినియోగించుకోవడం వల్లే ఈ విజయాలు సాధ్యమయ్యాయని చెప్పారు. అధ్యాపకులు, సిబ్బంది సమిష్టి కృషి ఫలితంగానే ఈ స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల అధికారులు ప్రత్యేకంగా సన్మానించారు.

