– ఎన్నికల సంఘం కమీషనర్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని
నవగీతం,జగిత్యాల ప్రతినిధి :
మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని అన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా (కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి) కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాణి కుముదిని మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్ కు అవసరమైన మేర బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసుకోవాలని, పోలింగ్ బృందాలు, డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద స్ట్రాంగ్ రూములలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత మున్సిపాలిటీలలో చైర్ పర్సన్, కార్పొరేషన్లలో మేయర్ ఎన్నిక కోసం ఫారం 2లను సిద్ధం చేసి సంసిద్ధం కావాలని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు ముందుగానే సమాచారం అందించాలని అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ…జిల్లాలోని 5 మున్సిపాలిటీల ఎన్నికలకు పోలింగ్ కు మరియు కౌంటింగ్ కు ఎన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశామని తెలిపారు. ఇందుకుగాను స్పెషల్ ఆఫీసర్లు, నోడల్ అధికారులు, కావలసిన సిబ్బందిని నియమించామని తెలిపారు. రెండవ రాండమైజేషన్ పూర్తిచేశామని తెలిపారు. 5 మున్సిపాలిటీలో జరుగు ఎన్నికలకు అవసరమైన పోలింగ్, కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన సిబ్బందికి పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించు విధులపై తగిన శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో జరగనున్న ఎన్నికలు మరియు పోలింగుల కొరకు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా, సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్, క్రిటికల్ పోలింగ్ లను గుర్తించి తగిన పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బీ. రాజ గౌడ్, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవోలు మధు సూదన్, జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్, జడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, నోడల్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

