జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
మున్సిపల్ సాధారణ ఎన్నికలు ఈనెల 11న జరుగనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ సోమవారం జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై విస్తృతంగా సమీక్షించారు. ఓటరు స్లిప్ల పంపిణీ, బ్యాలెట్ బాక్స్ నిల్వ కోసం స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, బ్యాలెట్ బాక్స్ ల ధ్రువీకరణ, అందుకు సంబందించిన కార్యకలాపాలు, మార్క్ చేయబడిన కాపీ రోల్ తయారీ గురించి, ఎన్నికల సామాగ్రి, పంపిణీ నిర్ణీత సమయానికి పూర్తయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి తగిన విధంగా సమయానికి అనుగుణంగా ఆహార ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ స్టేషన్లను మున్సిపల్ సిబ్బంది సందర్శించి పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర వసతులను ఎన్నికల సిబ్బందికి ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పోలింగ్ రోజున వృద్ధులు, దివ్యాంగ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలని, పోలింగ్ కేంద్రాల వద్ద ఏఎన్ఏం, ఆశ వర్కర్లు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల భద్రత చర్యలు తీసుకొని పూర్తి స్థాయిలో బందోబస్త్ ఏర్పాటు చేసే విధంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా పోలింగ్ అధికారులు డైరీను కచ్చితంగా నిర్వహిస్తూ, పోలింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి అంశాన్ని స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు అయ్యేలా సరైన ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దీనితో పాటు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి సంబంధించి డిఏ, టిఏ చెల్లింపులు నిబంధనల ప్రకారం, ఎలాంటి ఆలస్యం లేకుండా చేపట్టాలని స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక పోలింగ్ స్టేషన్ ను మోడల్ పోలింగ్ స్టేషన్ గా ఏర్పాటు చేసే విధంగా మెప్మా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 5 మున్సిపాలిటీలో జరగబోయే ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్ల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, స్పెషల్ ఆఫీసర్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

