క్రమశిక్షణతో ఉండడం తప్పా ..?
ఎటు తేల్చుకోలేని జీవన్ – డిల్లీకి ఫిర్యాదు అంటూ ముగింపు.
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా ? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలవడం తన బాధ్యత అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారి పేర్లను టికెట్ల కోసం ప్రతిపాదించడమే తాను చేసిన పని తప్పా ? అని నిలదీశారు. బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేతో కలిసి మున్సిపల్ ఎన్నికల టికెట్లపై చర్చించడం క్రమశిక్షణ కాదా ? అని ప్రశ్నించారు.

పార్టీ ఫిరాయింపు చట్టం కింద నోటీసులు ఎదుర్కొన్న ఎమ్మెల్యే, స్పీకర్‌కు తాను ఇంకా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గాంధీ భవన్లో జరిగిన అంతర్గత సమావేశానికి ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. జగిత్యాలలో 2019 మినహా అన్ని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని, టీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పోరాటం చేసిన కార్యకర్తలు ఇప్పుడు పక్కకు నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీ ఫారాలు ఇవ్వడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు. ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డుల్లో కనీసం 40 గెలుస్తామనే విశ్వాసం ఉందన్నారు. అయినప్పటికీ, తుది జాబితాలో చేర్పులు–మార్పులు ఎలా జరుగుతున్నాయో కార్యకర్తలకు స్పష్టత లేదని విమర్శించారు. రాయికల్ లో ఏకాభిప్రాయంతో జాబితా ఇచ్చినా, సగానికి పైగా ఇతరులకు బీ ఫారాలు ఇవ్వడంతో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల హక్కులు కాలరాస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతుంటే, ఇక్కడ మాత్రం అవకాశవాదులకు ప్రాధాన్యం ఇవ్వడం ఏ విధమైన పార్టీ సిద్ధాంతమని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని అఖిల భారత కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తానని జీవన్ రెడ్డి తెలిపారు. తన వ్యక్తిగత విషయాల కోసం కాదు, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల హక్కుల కోసమే తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.

