నవగీతం, మెట్ పల్లి:
కోరుట్లకు వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టడంతో నెల రోజుల శిశువు మృతి చెందిన ఘటన మెట్ పల్లి పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… షేక్ సుమీర్ తన కుటుంబ సభ్యులు అయిన తల్లి రక్కిం సుల్తానా, అత్త షాహిన్ బేగం, భార్య సమ్రిన్ బేగం, నెల రోజుల కూతురు ఇనాయతో కలిసి షాపింగ్ కోసం ఆటో నంబర్ టీజీ 21 టీ 0532లో కోరుట్లకు వెళ్తున్నారు. గురువారం రాత్రి సుమారు 8:20 గంటల సమయంలో ఆరేపేటలోని ఐసీఐసీఐ బ్యాంకు ముందు చేరుకున్నప్పుడు వెనుక నుంచి వచ్చిన నిస్సాన్ కారు ఏపీ 09 సీఎల్ అతివేగంగా వచ్చి ఆటో వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి ఇనాయ తల వెనుక భాగంలో తీవ్ర గాయాలు కాగా, షాహిన్ బేగంకు ఎడమ చేతికి, రక్కిం సుల్తానాకు తల భాగంలో గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో మృతి చెందింది. ఈ ఘటనపై కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మెట్ పల్లి సబ్ ఇన్స్పెక్టర్ పి. కిరణ్ కుమార్ తెలిపారు.

