జర్నలిస్టు రాజేందర్ కు 10వేల ఆర్థిక సాయం
మానవత్వం చాటుకున్న గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్
నవగీతం, పెద్దపల్లి:
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న పెద్దపల్లి గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పెద్దపల్లి మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్టు కలవైన రాజేందర్ గత కొంతకాలంగా పక్షవాతం పడి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.రాజేందర్ తొలుత పక్షవాతంతో ఆసుపత్రిలో చేరిన సమయంలోనే విషయం తెలుసుకున్న అల్లంకి శ్రీనివాస్ వెంటనే స్పందించి,అప్పట్లోనే రూ.5వేల ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు.అయితే ప్రస్తుతం రాజేందర్ ఆరోగ్యం మరింత క్షీణించి,అచేతన స్థితిలోకి చేరుకోవడంతో ఆయన దీనస్థితిని చూసి చలించిన అల్లంకి శ్రీనివాస్ తాజాగా మరోసారి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయం కింద మరో 10వేల రూపాయల నగదును అందజేసి ఆ కుటుంబానికి కొండంత భరోసా కల్పించారు.కష్టకాలంలో ఉన్న తోటి మనిషిని ఆదుకోవడానికి రెండు విడతలుగా ఆర్థిక తోడ్పాటునందించిన అల్లంకి శ్రీనివాస్ చొరవను స్థానిక జర్నలిస్టులు ప్రత్యేకంగా అభినందించారు.ఒక సామాన్యుడి కష్టాన్ని గుర్తించి,మానవత్వంతో స్పందించినందుకు జర్నలిస్టులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.సమాజ సేవలో నిరంతరం ముందుండే అల్లంకి శ్రీనివాస్ ఉదారతపై స్థానికులు మరియు పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తన వంతు సాయంతో ఆ కుటుంబానికి అండగా నిలిచిన శ్రీనివాస్ కు రాజేందర్ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ ధన్యవాదాలు తెలిపారు.
