ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
కొడిమ్యాల మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఆర్ అండ్ బి రహదారి మరమ్మతు పనులు తూతూ మంత్రంగా నిర్వహించడంతో గ్రామ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా రహదారి పూర్తిగా దెబ్బతిని పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు,పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో అధికారులు గురువారం రహదారిపై ఉన్న గుంతలను డాంబర్తో పూడ్చే పనులు చేపట్టారు.అయితే గుంతలను సరైన విధంగా మరమ్మతు చేయకుండా పైపైగా డాంబర్ పోసి పనులు ముగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు.నాణ్యత లేకుండా నిర్వహించిన ఈ పనులు కొద్దిరోజులకే మళ్లీ దెబ్బతినే అవకాశముందని గ్రామప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులతో సమస్యను ముసుగులో పెట్టకుండా రహదారిని పూర్తిగా పునర్నిర్మించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి రహదారి పనులను నాణ్యతతో చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

