అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ఘన సన్మానం
నవగీతం, కొడిమ్యాల:
కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామంలోని సామాన్య గీత కార్మికుడి కుటుంబంలో జన్మించి,ఆర్థిక ఇబ్బందులను అధిగమించి విద్యా రంగంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన నేరెళ్ల శైలజ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్ర విభాగంలో ఆమె ‘డాక్టరేట్’ పట్టా సాధించిన సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ తిర్మలాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఆమెను ఘనంగా సన్మానించారు.ప్రభుత్వ విద్యతోనే ఉన్నత శిఖరాలకు..నేరెళ్ల సాయగౌడ్ కుమార్తె అయిన శైలజ, తన ప్రాథమిక విద్య నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే చదివారు.ఒకవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే, పట్టుదలతో శ్రమించి డాక్టరేట్ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “స్త్రీలు ఎందులోనూ తక్కువ కాదని, ఆకాశంలో సగమే కాదు. అవకాశాల్లోనూ సగమని శైలజ నిరూపించారు.సామాన్య కుటుంబం నుండి వచ్చి విజ్ఞాన శిఖరాలను అధిరోహించడం మన గ్రామానికి దక్కిన గౌరవం” అని కొనియాడారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి మరెన్నో విజయాలు సాధించాలని ఆమెను ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్, గ్రామ నాయకులు మర్రిపెల్లి శంకర్, గంగుల మల్లేశం, తైదల లక్ష్మణ్, ధర్మపురి, సాయి, వినోద్, సత్యం, మహేష్, అంజయ్య తదితరులతో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

