నవగీతం, మెట్ పల్లి టౌన్:
మెట్‌పల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కానింగ్ కేంద్రాలను కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యుడు కల్వకుంట్ల సంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో మహిళల ఆరోగ్య రక్షణ కోసం అందుబాటులోకి తీసుకొచ్చిన హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సదుపాయాలను పెంచడం ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ వైద్యశాలల్లోనే అత్యాధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

కొత్తగా ప్రారంభించిన స్కానింగ్ కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలు, మహిళలు, ఇతర రోగులు ఇకపై ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అవసరమైన పరీక్షలు చేయించుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. దీనివల్ల ప్రజలకు సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని తెలిపారు.అలాగే హెచ్‌పీవీ టీకా మహిళల ఆరోగ్య రక్షణలో ఎంతో కీలకమని ఆయన వివరించారు.

ఈ టీకా తీసుకోవడం ద్వారా మహిళల్లో వచ్చే గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులను ముందుగానే నివారించవచ్చని చెప్పారు. ముఖ్యంగా యువతులు, మహిళలు ఈ టీకా గురించి అవగాహన పెంచుకుని తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.అనంతరం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లను ఎమ్మెల్యే సంజయ్ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ చైర్మన్ ఓంకారి నవీన్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ నరేష్, ప్రవీణ్, వైద్యులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు.


