రహ్ వీర్ పథకం ద్వారా రూ.25 వేల పారితోషికం
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను (గుడ్ సమారిటన్స్) ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “రహ్ వీర్ పథకం” ద్వారా రూ.25,000/- నగదు పారితోషికం తో పాటు ప్రశంసా పత్రం అందజేయబడుతుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ట్ తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రమాదం జరిగిన తొలి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని ఈ సమయంలో బాధితులకు సమయానికి వైద్య సహాయం అందితే అనేక ప్రాణాలు రక్షించవచ్చని పేర్కొన్నారు. కానీ కొంతమంది పౌరులు పోలీస్ కేసులు ఉండొచ్చనే భయంతో గాయపడిన వారికి సహాయం చేయడానికి వెనుకంజ వేస్తున్నారని ఈ భయాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం “రహ్ వీర్ పథకం”ను అమలు చేస్తోందని తెలిపారు. ఈ పథకం ప్రకారం రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడిన వారికి ప్రభుత్వం రూ.25 వేల నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తుంది. సహాయం చేసిన వ్యక్తిపై ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే 108 అంబులెన్స్ సేవలకు సమాచారం ఇవ్వాలని, సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి గాయపడిన వారిని తరలించాలని సూచించారు. ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించి ప్రాణాలను కాపాడే కార్యంలో భాగస్వామి కావాలని కోరారు

