మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
నవగీతం,కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో బుధవారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రైతుల సమస్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల తరఫున ధాన్యం కొనుగోళ్లు తక్షణమే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. జిపిఎస్, ఆన్లైన్ విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ, ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేస్తాం అని ఇచ్చిన హామీ అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.నెల రోజులుగా రైతులు ధాన్యం కుప్పలు వేసుకుని ఎదురు చూస్తున్నా కొనుగోళ్లు జరగడం లేదని, అకాల వర్షాల వల్ల నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కటింగ్ లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కొండగట్టు అంజన్న వద్ద ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను ప్రమాణం చేయడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపిస్తూ, ప్రభుత్వం రైతుల పక్షాన నిలవకుండా అడ్డంకులు సృష్టిస్తోందని అన్నారు.క్వింటాల్‌కు 7–8 కిలోల వరకు కటింగ్ జరుగుతోందని, దీని వల్ల రైతులకు భారీ నష్టం కలుగుతోందని పేర్కొన్నారు. రైస్ మిల్లర్లతో కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ, గతంలో కేసీఆర్ ప్రభుత్వం తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిందని గుర్తుచేశారు. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను మోసం చేస్తున్నారని, ధాన్యం కొనలేని ప్రభుత్వం కొనసాగడానికి అర్హత లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు ద్రోహి ప్రభుత్వమని ఆరోపిస్తూ, ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలతో చొప్పదండి రాజకీయాల్లో ఉద్రిక్తత మరింత పెరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, కొడిమ్యాల మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బల్కం మల్లేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీలు సురుగు శ్రీనివాస్, గడ్డం చంద్రమోహన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, యూత్ మండల అధ్యక్షుడు గడ్డం లక్ష్మారెడ్డి, నాయకులు కొత్తూరు స్వామి, రాచకొండ చంద్రమోహన్, బైరి వెంకటి, పర్లపెళ్లి అఖిల్, డి. నర్సయ్య, శ్రావణ్, మోహన్, సాగర్ రావు తదితరులు పాల్గొన్నారు.

