ఖతార్‌లో తెలుగు సోదరుల సహకారంతో రూ.1.20 లక్షల ఆర్థిక సహాయం
మల్లాపూర్, అక్టోబర్17,(నవగీతం):
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన తలారి ముత్తన్న (55) ఖతార్ దేశంలో అనారోగ్యంతో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని కలిగించింది. మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన తెలంగాణ గల్ఫ్ సమితి, తెలుగు సోదరుల సహకారంతో రూ.1,20,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు..
ముత్తన్న మృతి వార్తను కుటుంబ సభ్యులు తెలంగాణ గల్ఫ్ సమితి దృష్టికి తీసుకురాగానే సమితి ప్రతినిధులు స్పందించారు. ఖతార్‌లోని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, మృతదేహాన్ని త్వరితగతిన స్వగ్రామానికి తరలించేందుకు కీలకంగా కృషి చేశారు.
అనంతరం మృతుడి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న సమితి, బాధిత కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఖతార్‌లోని తెలుగు వారందరికీ ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తికి స్పందించిన పలువురు తెలుగు సోదరులు తమకు తోచినంత సహాయాన్ని అందించారు. ఈ క్రమంలో తెలంగాణ గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యుడు అందుగుల రాకేష్ యాదవ్, గ్రామ పెద్దల సమక్షంలో బాధిత కుటుంబానికి రూ.1,20,000 (లక్షా ఇరవై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షల గల్ఫ్ ఎక్స్‌గ్రేషియా పరిహారం బాధిత కుటుంబానికి అందేలా చేయడానికి తెలంగాణ గల్ఫ్ సమితి తన వంతు కృషిని కొనసాగిస్తుందని ప్రతినిధులు తెలిపారు. విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కార్మికులు మృతి చెందినప్పుడు వారి కుటుంబాలు ఎదుర్కొనే ఆర్థిక, మానసిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
కష్టకాలంలో మానవత్వంతో స్పందించి ఆర్థిక సహాయం అందించిన ఖతార్‌లోని తెలుగు సోదరులందరికీ తెలంగాణ గల్ఫ్ సమితి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.
ఈ కార్యక్రమంలో రాఘవపేట సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ మల్లాపూర్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, నడికుడ గ్రామ సర్పంచ్ తూర్పు సమతా రాజేష్, నాయకులు ఎండీ అమీన్, భైరి రవికుమార్ యాదవ్, మాధం సాగర్, రాగుల శ్రీనివాస్, మామిడి శంకర్, దేవుడు నారాయణ, రాజకుమార్, తలారి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

