నవగీతం మెట్ పల్లి:
మెట్‌పల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ తరుపున కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధిలో స్పష్టమైన చరిత్ర ఉందని తెలిపారు. కేసీఆర్ హయాంలో మెట్‌పల్లి పట్టణం ఎన్నో అభివృద్ధి పనులకు నాంది పలికిందని, ముఖ్యంగా గతంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేదని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేసిందని, యువతకు అవకాశాలు కల్పిస్తూ కొత్త యువ అభ్యర్థులతో మంచి మున్సిపల్ పాలన అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.

గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో మెట్‌పల్లి పట్టణానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమీ జరగలేదని, కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అక్రమ కబ్జాలు పెరిగాయని, ప్రజలకు ఎలాంటి భద్రత లేకుండా పరిస్థితులు తయారయ్యాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే పట్టణంలో శాంతి భద్రతలు, పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.మెట్‌పల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉందని ప్రజలను కోరారు.


