రూ. 25 కోట్ల విలువైన పార్కు స్థలం రక్షణ
ఫలించిన కాలనీవాసుల పదేళ్ల పోరాటం
హర్షం వ్యక్తం చేసిన భాగ్యలక్ష్మి కాలనీవాసులు
నవగీతం, కుత్బుల్లాపూర్ :
ప్రజా ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడిన ‘హైడ్రా’ మరోసారి తన పనితనాన్ని చాటుకుంది. తప్పుడు పత్రాలతో పార్కు స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన కబ్జాదారుల ఎత్తులను చిత్తు చేస్తూ.. సుమారు రూ. 25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడింది. పదేళ్లుగా ఈ స్థలం కోసం పోరాడుతున్న కాలనీవాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ చొరవతో ఎట్టకేలకు న్యాయం జరిగింది. కుత్బుల్లాపూర్ సర్కిల్, సుభాష్ నగర్ (130) డివిజన్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో సాయిబాబా ఆలయం పక్కన సుమారు 450 గజాల స్థలం ఉంది. దీనిని లేఅవుట్‌లో పార్కు కోసం కేటాయించారు. అయితే, ఈ బహిరంగ ప్రదేశంపై కొన్నాళ్లుగా కబ్జాదారుల కన్ను పడింది. తప్పుడు పత్రాలు సృష్టించి, ఆ స్థలాన్ని హస్తగతం చేసుకునేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గత పదేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో కాలనీ ప్రతినిధులు నేరుగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి, పార్కు స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడి తిరిగి కాలనీకి అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

దీనిపై కమిషనర్ తక్షణమే స్పందించారు. సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అది పార్కు స్థలమేనని ధ్రువీకరించారు. వెంటనే హైడ్రా సిబ్బందిని రంగంలోకి దించి, కాలనీవాసుల సమక్షంలోనే ఆ స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయించారు. ఈ భూమిని ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. సుదీర్ఘ పోరాటం తర్వాత పార్కు స్థలం దక్కడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. కాలనీ ప్రెసిడెంట్ సాగర్ రెడ్డి, ఇతర సభ్యులు హైడ్రా కమిషనర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా ఆస్తుల పరిరక్షణలో హైడ్రా చూపిస్తున్న చొరవ అభినందనీయమని టెంపుల్ ప్రెసిడెంట్ డి. యాదగిరి యాదవ్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలనీ సలహాదారులు జి. అరుణ్ రెడ్డి, టెంపుల్ జనరల్ సెక్రటరీ జె. నందం గౌడ్, వేణుగోపాల్ రావు సొసైటీ సభ్యులు యస్.వి సాగర్ రెడ్డి, డి.యాదగిరి యాదవ్, జి.అరుణ రెడ్డి, జె. నందం గౌడ్, కె.కోమరయ్య యాదవ్, వేణుగోపాల్ ,శంకర్ చారీ, హరిబాబు తదితరులు పాల్గొన్నారు

