నవగీతం ,హైదరాబాద్:
పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయణుడి అలంకారంలో జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి కటాక్షం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారు పరమపద వైకుంఠ నారాయణుడి అలంకారంలో కటాక్షించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని సేవించుకున్నారు.

శేషుడు స్వామివారికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలె నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు బోధిస్తున్నారు. ఈ వాహనసేవలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు, జూబ్లీహిల్స్ టెంపుల్ లోకల్ అడ్వైజరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వెంకటేశ్వర రెడ్డి, హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్ బాబు, ప్రముఖ పారిశ్రామికవేత్తపి దొరస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ నిరంజన్, హరికృష్ణ, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

