Tuesday, April 14, 2026
ads
Homeజిల్లా వార్తలుహైదరాబాద్భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు.

భక్తుల మనోరథాన్ని అధిరోహించిన దేవదేవుడు.

📰 Generate e-Paper Clip

పండుగ వాతావరణంలో రథోత్సవ మహోత్సవం.

నవగీతం, హైదరాబాద్:

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు ర‌థాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం 7.45 గం.లకు శ్రీ‌దేవి, భూదేవి స‌మేత వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి రథోత్సవ మహోత్సవం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య స్వామివారి రథం నాలుగు మాడ వీధులలో మహా వైభవంగా రథయాత్ర సాగింది. కర్పూరహారతులు సమర్పించి, గోవిందా గోవిందా అంటూ భక్తులు నినాదాలు చేస్తూ తమ కోరికలు నెరవేరాలని, రథాన్ని లాగి ప్రార్థించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవం కోలాహలంగా జరిగింది.

ఈ సందర్భంగా భక్తుల సందడి, విశ్వాసం, ఆనందోత్సాహాలు ప్రత్యేకంగా కనిపించాయి. దేవదేవుడి దివ్య దర్శనం కోసం చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ‌వారి రథాన్ని దర్శించిన వారికి జన్మాదిదుఃఖాలు నశించి, మోక్షం లభిస్తుంది. రథస్తుడైన మాధవుడిని దర్శిస్తే పునర్జన్మ ఉండదని అర్చ‌కులు తెలిపారు. అశ్వవాహనంపై క‌ల్కి అవ‌తారంలో క‌ల్యాణ శ్రీ‌నివాసుడు. శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ స్వామివారు రాత్రి 7 గంటలకు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించారు. ఉపనిషత్తులు, ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. స్వామి అశ్వవాహనాదిరూఢుడై కల్కి స్వరూపాన్ని ప్రకటిస్తూ, కలిదోషాలకు దూరంగా ఉండాలని, తన సంకీర్తనలు చేసి తరించాలని ప్రబోధిస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరిరోజైన బుధవారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం 06.00 గం.ల నుండి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం ఉద‌యం 8.00 గం.లకు ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో శాస్త్రోక్తంగా చక్రస్నానం జరగనుంది అని టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్, తెలిపారు. ఈ వాహ‌న‌సేవ‌లో టీటీడీ జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వర టెంపుల్ లోకల్ అడ్వైసరీ కమిటీ ప్రెసిడెంట్ ఏ వేంకటేశ్వరా రెడ్డి, హైదరాబాద్ టీటీడీ ఎఈఓ యూ రమేష్, ఆలయ అర్చకులు, టెంపుల్ ఇన్పెక్టర్స్ నిరంజన్, హరికృష్ణ, మాజీ లోకల్ అడ్వైసరీ కమిటీ మెంబర్ బివి రమణారెడ్డి, పలువురు అధికారులు, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular