Thursday, February 26, 2026
ads
Homeతెలంగాణజగిత్యాలలావోస్ దేశంలో ఉద్యోగాల పేరుతో సైబర్ మోసం

లావోస్ దేశంలో ఉద్యోగాల పేరుతో సైబర్ మోసం

📰 Generate e-Paper Clip

నాలుగు సెల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం

యువతను అక్రమంగా తరలించి మోసాలకు పాల్పడిన నలుగురు అరెస్టు

విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మభ్యపెట్టే వారిపై కఠిన చర్యలు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

నవగీతం,జగిత్యాల ప్రతినిధి:

విదేశీ ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసి లావోస్ దేశానికి అక్రమంగా తరలించిన గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

పట్టుబడిన నిందితుల వివరాలు: మల్లాపూర్ మండలం ఓబులాపూర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ విజయేందర్ , సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామానికి చెందిన మీసాల రాజశేఖర్, ధర్మపురి కి చెందిన శ్యామ్ రావు రాజశేఖర్, రాజు వైజాగ్, ప్రస్తుతం లావోస్‌లో ఉన్నాడు. నిందితుడు విజయేందర్ 2024 నవంబర్‌లో లావోస్ వెళ్లి అక్కడి సైబర్ ఫ్రాడ్ నెట్‌వర్క్‌లో చేరాడు. ప్రతి వ్యక్తిని లావోస్‌కు రప్పిస్తే ఒక్కొక్కరికి 13,000 యువాన్లు (సుమారు ₹1.75 లక్షలు) కమిషన్ ఇస్తామని చెప్పడంతో జగిత్యాల మరియు పరిసర ప్రాంతాల యువతను రిక్రూట్ చేయడం ప్రారంభించాడు.

మరియు బ్యాంకాక్ కాల్ సెంటర్ ఉద్యోగం పేరుతో ఒక్కొక్కరి నుండి రూ.75,000 నుండి రూ.1,05,000 వరకు వసూలు చేసి, ముందుగా టూరిస్టు వీసాపై థాయిలాండ్ (బ్యాంకాక్) కు రప్పించి, అక్కడి నుండి ఏజెంట్ల ద్వారా సరిహద్దు అక్రమంగా దాటి లావోస్ దేశంలోని గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతానికి తరలించేవారు. అక్కడ చైనా కంపెనీల ఆధ్వర్యంలో నడుస్తున్న సైబర్ కాల్ సెంటర్లలో పని చేయమని బలవంతం చేసేవారు.

అమెరికా ఇన్ఫ్లుయెన్సర్ల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు సృష్టించి, ముఖ్యంగా అమెరికా లో నివసిస్తున్న భారతీయులను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్ మోసాలు చేయించేవారు. పని చేయనని చెప్పిన వారికి పాస్‌పోర్టులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడేవారు. మోసపోయిన బాధితుని ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు విజయేందర్‌పై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేయగా, 17-02-2026 న రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణలో మిగతా ముగ్గురు నిందితుల వివరాలు వెలుగులోకి రావడంతో వారిని కూడా అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి 4 సెల్ ఫోన్లు, కీలక పత్రాలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.విదేశీ ఉద్యోగాలు, త్వరితగతిన వీసాలు కల్పిస్తామని చెప్పే అనుమానాస్పద ఏజెంట్లను నమ్మకూడదని, ఏ సంస్థ ద్వారా అయినా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్లు, ప్రభుత్వ గుర్తింపు వివరాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని కోరారు.

ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేయడంలో పోలీస్ శాఖ ఎప్పుడూ ముందుంటుందని ఎస్పీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ డిఎస్పి వెంకటరమణ, రూరల్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్‌ఐలు ఉమాసాగర్, దినేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular