ప్రత్యేక పూజలు చేసిన నాయకులు, రైతులు
నవగీతం, రుద్రంగి :
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రానికి శ్రీపాద ఎల్లంపల్లి నీరు గురువారం చేరుకోవడంతో పంప్ హౌజ్ వద్ద కాంగ్రెస్ నాయకులు పూలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. వరి పంటలు ఎండిపోతుండడం వాస్తవమేనని, రైతులు తమను క్షమించాలని మోటర్ లలో సాంకేతిక లోపం వల్ల నీటి విడుదల జాప్యం జరిగిందని అన్నారు. ఫిబ్రవరి నెలలోనే రైతుల పంట పొలాలకు నీరు అందించాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎంతగానో కృషి చేశారని కానీ పంప్ హౌజ్ మరమ్మతులు సాంకేతిక లోపం వల్ల ఆలస్యం అయిందని అన్నారు. ఈ విషయం తెలియకుండా ప్రతిపక్ష నాయకులు రైతులను రెచ్చగొడుతూ రాజకీయం చేస్తున్నారని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైస్సార్ ముందు చూపుతోనే రుద్రంగి గ్రామానికి ఎల్లంపల్లి నీళ్లు వస్తున్నాయని గుర్తు చేశారు. నీటి విడుదలకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లకు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చెర్మెన్ చెలుకల తిరుపతి, సర్పంచ్ గండి నారాయణ, ఉపసర్పంచ్ మాడిశెట్టి అభిలాష్ మరియు నాయకులు పాల్గొన్నారు.

