Thursday, May 7, 2026
ads
Homeఆంధ్రప్రదేశ్వేసవి రద్దీకి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

వేసవి రద్దీకి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు

📰 Generate e-Paper Clip

నవగీతం, తిరుపతి:

వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా అన్ని స‌దుపాయాల‌ను అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది.

ఇంజినీరింగ్ ఏర్పాట్లు

వేస‌వి ర‌ద్దీ నేప‌థ్యంలో టీటీడీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టడం జ‌రిగింది. ఇందుకోసం సుమారు రూ.2 కోట్లతో పనులు చేపట్టడం జరిగింది. భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కల్పించేందుకు బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం డ్యామ్ సర్కిల్ మీదుగా ఔటర్ రింగ్ రోడ్ వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, మ్యూజియం ప్రాంగణం, నారాయణగిరి ఉద్యానవనాల్లో నీడనిచ్చే షెల్టర్లు ఏర్పాటు చేశారు.క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం కూల్ పెయింటింగ్ పనులు, అదనపు తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశారు.ముఖ్యంగా శ్రీవారి ఆలయం పరిసరాలు, లడ్డూ కౌంటర్లు, భక్తుల రాకపోకలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చలువ పందిళ్ల నిర్మాణం చేపట్టారు.ఇదే సమయంలో నాలుగు మాడ వీధుల్లో సింథటిక్ ఎనామెల్ కూల్ పెయింట్ వేయడం ద్వారా భక్తులు నేల వేడి నుండి ఉపశమనం పొందేలా చర్యలు తీసుకున్నారు.బాట గంగమ్మ గుడి సర్కిల్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు.

ఆరోగ్య విభాగం ప్రత్యేక ఏర్పాట్లు

అదేవిధంగా టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీరు పంపిణీ చేయడం జరుగుతోంది. వేసవి నేపథ్యంలో భక్తులు తాగునీటికి ఇబ్బంది పడకుండా శ్రీవారి సేవకులు నేరుగా భక్తుల వద్దకే వెళ్లి తాగు నీరు అందిస్తున్నారు. ఒక బ్యాచ్ లో 15 మంది వంతున, మొత్తం మూడు బ్యాచుల్లో రోజుకు 45 మంది శ్రీవారి సేవకులు భక్తులకు తాగునీరు అందిస్తున్నారు.మరోవైపు ద‌ర్శ‌న క్యూలైన్ల‌లో పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట వేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు చెత్త‌ను తొల‌గిస్తూ భ‌క్తుల‌కు ప‌రిశుభ్ర‌మైన వాతావ‌ర‌ణం ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

వైద్య విభాగం ఏర్పాట్లు

తిరుమ‌ల‌లో మొత్తం 16 వైద్య కేంద్రాలు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్ర‌దేశాల్లో భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన త‌క్ష‌ణ వైద్య సేవ‌లు అందించ‌బ‌డ‌తాయి. ర‌ద్దీకి అనుగుణంగా ఔట‌ర్ రింగ్ రోడ్డులో క్యూలైన్ల వెంబ‌డి ఒక మొబైల్ ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ అందుబాటులో ఉంచ‌డం జ‌రిగింది. అదేవిధంగా నారాయ‌ణ‌గిరి వ‌ద్ద ఫ‌స్ట్ ఎయిడ్ సెంట‌ర్ అందుబాటులో ఉంటుంది.

విరివిగా అందుబాటులో ల‌డ్డూలు

వేస‌వి ర‌ద్దీకి త‌గిన‌విధంగా భ‌క్తుల‌కు స్వామివారి ల‌డ్డూల‌ను విరివిగా అందుబాటులో ఉంచ‌డం జ‌రుగుతోంది. సాధార‌ణ రోజుల్లో 3.50 ల‌క్ష‌ల లడ్డూల‌ను అందుబాటులో ఉంచగా, పెరిగిన ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని అద‌నంగా మ‌రో 3.50 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను బ‌ఫ‌ర్ స్టాక్ గా అందుబాటులో ఉంచడం జ‌రిగింది.

వ‌స‌తి సౌక‌ర్యాలు

తిరుమలలో స్థలాభావం వల్ల పరిమిత సంఖ్యలో వసతి గదులు నిర్మిచబడ్డాయి. దీంతో 60వేల మంది భ‌క్తుల‌కు మించి తిరుమ‌ల‌లో వ‌స‌తి కేటాయించడానికి వీలుప‌డ‌దు. ప్ర‌స్తుతం తిరుమ‌ల‌లో దాదాపు 7500 గ‌దులు, ఐదు యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాలు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. గ‌దులు పొంద‌లేని భ‌క్తులు తిరుమ‌ల‌లోని పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ (ప‌ద్మ‌నాభ నిల‌యం), పీఏసీ-5 ల‌లో ఉన్న దాదాపు తొమ్మిదివేల‌ లాక‌ర్లను వినియోగించుకోవ‌చ్చు. కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉండే భక్తులకు వసతి సౌకర్యము కల్పించుటకుగాను ఒంటరిగా వచ్చే భక్తులకు వసతి గదులు కేటాయించ‌డబడదు.

త‌ల‌నీలాల స‌మర్ప‌ణ‌కు ఏర్పాట్లు

తిరుమ‌ల‌లో భ‌క్తులు స్వామివారికి త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ కోసం భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేప‌ట్టింది. ఇందులో ప్ర‌ధాన క‌ల్యాణ‌క‌ట్ట‌తో పాటూ పీఏసీ-1, పీఏసీ-2, పీఏసీ-3, పీఏసీ-5, జీఎన్సీ, హెచ్‌వీసీ, స‌ప్త‌గిరి విశ్రాంతి గృహం, నంద‌కం విశ్రాంతి గృహం, కౌస్తుభం విశ్రాంతి గృహం, శ్రీ‌వేంక‌టేశ్వ‌ర విశ్రాంతి గృహం, శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి గృహం ప్రాంతాల్లో 11 మినీ క‌ల్యాణ క‌ట్ట‌లు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్నాయి. టీటీడీలో మొత్తం 1152 మంది క్షుర‌కులు భ‌క్తుల‌కు సేవ‌లు అందిస్తున్నారు. వీరిలో 269 మంది మ‌హిళ‌లు ఉన్నారు.వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు నీడ, చల్లని వాతావరణం, పరిశుభ్రత, తాగునీరు, వ‌స‌తి, త‌ల‌నీలాల స‌మ‌ర్ప‌ణ‌, ల‌డ్డూలు వంటి అవసరమైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular