కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు..
చందోలిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి లక్ష్మణ్ కుమార్
నవగీతం, జగిత్యాల/గొల్లపల్లి:
టీఆర్ఎస్, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే తప్ప, తాలు పేరుతో క్వింటాలకు నాలుగు నుండి ఐదు కిలోల ధాన్యం కోత విధించేవారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం గొల్లపల్లి మండలం చందోలి గ్రామం లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు దోపిడీకి గురయ్యాయని అన్నారు.చివరకు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే క్వింటాలుకు నాలుగు నుంచి ఐదు కిలోలు తరుగు, తప్ప, తాలు పేరుతో కోతలు విధించేవారని మంత్రి అన్నారు.

2023 లో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు ఇలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేస్తున్నామని మంత్రి తెలిపారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మంత్రి సూచించారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అన్నారు.


