టి ఆర్ టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్
నవగీతం, జగిత్యాల ప్రతినిధి:
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ డిమాండ్ చేశారు.ఆదివారం రాయికల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులతో కూడిన బదిలీల ప్రక్రియను ఎటువంటి జాప్యం లేకుండా జనాభా లెక్కల అనంతరం జూలై మాసంలో చేపట్టాలనీ డిమాండ్ చేశారు. అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం ద్వారానే విద్యా వ్యవస్థలో మరింత ఉత్సాహంతో పని చేసే వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఖచ్చితంగా ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టును మంజూరు చేయాలి. పరిపాలనాపరమైన ఇబ్బందులు తొలగి, విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే ప్రాథమిక స్థాయి నుండే పటిష్టమైన నాయకత్వం అవసరమని ఆయన పేర్కొన్నారు.పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ లకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాటికీ పి ఆర్ సి అమలు చేయాలని కోరారు. మే 5న నిర్వహించే జిల్లా కేంద్ర నిరహార దీక్షలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం టి ఆర్ టి ఎఫ్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ఈ సందర్భంగా కటకం రమేష్ హెచ్చరించారు.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా అధ్యక్షులు తుంగూరి సురేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లె చిన్నయ్య, రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బేతి సాయి కృష్ణ , రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అంగడి రవీందర్, రాష్ట్ర కన్వీనర్ ముక్కెర శేఖర్, నాయకులు రాజ్ కిశోర్, రమేష్ , సత్యనారాయణ , నాగభూషణం, సురేష్, మధు మండల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు మరియు టి ఆర్ టి ఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

