డ్రైవర్ చాకచక్యం.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ వైనం
నవగీతం,కొడిమ్యాల ప్రతినిది:
కొడిమ్యాల మండలంలోని నల్లగొండ గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. భానుడి భగభగలకు వేడెక్కిన ఓ ట్రాక్టర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.ఘటన వివరాల్లోకి వెళ్తే..నమిలకొండ గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ మట్టి ఇటుకల (బ్రిక్స్) లోడ్‌తో వెళ్తోంది. నల్లగొండ గ్రామ సమీపానికి చేరుకోగానే, ఎండ తీవ్రత కారణంగా ఇంజిన్ భాగంలో ఒక్కసారిగా పొగలు వచ్చి మంటలు అంటుకున్నాయి.అప్రమత్తమైన డ్రైవర్..మంటలను గమనించిన డ్రైవర్ ఏమాత్రం తడబడకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించాడు. వెంటనే ట్రాక్టర్‌ను రోడ్డు పక్కకు నిలిపివేసి, ఇంజిన్ ఆఫ్ చేసి కిందకు దూకేశాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికులు, స్థానిక గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి నీళ్లు, ఇసుకతో శ్రమించి మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పింది.ఊపిరి పీల్చుకున్న గ్రామస్తులుసమయానికి డ్రైవర్ అప్రమత్తం కావడం, గ్రామస్తులు సకాలంలో స్పందించి మంటలు ఆర్పివేయడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.ట్రాక్టర్ ఇంజిన్ స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పెరిగిపోతున్న ఎండల దృష్ట్యా వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పలువురు సూచిస్తున్నారు.

