నవగీతం, కొడిమ్యాల ప్రతినిధి:
జగిత్యాల జిల్లా మల్యాల మండలం, ముత్యంపేట గ్రామంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘దివ్య భారత్’ నివేదికలో స్థానం లభించింది. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల విశేషాలను దేశీయ, విదేశీ పర్యాటకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ నివేదికను రూపొందించారు.ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎస్ అంజనారెడ్డి సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.నివేదికలో ఆలయానికి చోటు కల్పించడంలో సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ , స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం లకు వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈఓ మాట్లాడుతూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలల వారీగా పర్యటించదగిన పర్యాటక ప్రదేశాలు, వాటి ప్రాధాన్యతలను వివరంగా ఈ పుస్తకంలో చేర్చినట్లు తెలిపారు.ఈ నివేదిక ద్వారా పర్యాటకులు పర్యాటక స్థలాలపై సమగ్ర అవగాహన పొందడమే కాకుండా, సందర్శనకు అనువైన సమయాలను తెలుసుకునే వీలుందని చెప్పారు. ‘దివ్య భారత్’ పుస్తకంలో కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం చేర్చడం ద్వారా దేశీయ, విదేశీ పర్యాటకులకు ఆలయ దర్శనానికి మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొన్నారు.


