నవగీతం,మెట్ పల్లి ప్రతినిధి:
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్రకృతిని పరిరక్షించాలనే లక్ష్యంతో శ్రీ పెద్దపూర్ మల్లికార్జున స్వామి సేవా అన్నదాన కార్యక్రమానికి స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాస్‌లు విరాళంగా అందజేశారు. ఆదివారం “ప్లాస్టిక్‌ను నివారిద్దాం – ప్రకృతిని కాపాడుదాం” అనే సందేశంతో గురుదత్త ఏజెన్సీకి చెందిన రామ్ నారాయణ (కోరుట్ల), యాకిన్‌పూర్‌కు చెందిన కళ్యాణ్ శంకర్ రెడ్డి కలిసి 400 స్టీల్ ప్లేట్లు, 200 స్టీల్ గ్లాస్‌లను అందించారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాస్‌ల వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దాతలు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ రెడ్డి, పెద్దపూర్ మల్లన్న గుడి చైర్మన్ జవిడి తిరుపతి రెడ్డి, వీడీసీ చైర్మన్ దశగౌడ్, మాజీ ఎంపీటీసీ తెలుకంటి శంకరయ్య, మాజీ మల్లన్న గుడి చైర్మన్ నారాయణ రెడ్డి, మల్లన్న గుడి వైస్ చైర్మన్ మేర్గు విలాస్ గౌడ్, ఆలయ పూజారి ఆసరి మహేష్, కమిటీ సభ్యులు గొర్రె సుకన్య రంజిత్, చేపూరి రమేష్ రెడ్డి, కొమ్ముల శేఖర్ రెడ్డి, అజార్ తదితరులు పాల్గొన్నారు. కాగా దాతల సేవాభావాన్ని ఆలయ కమిటీ సభ్యులు అభినందించి వారికి కృతజ్ఞతలు తెలిపారు.

