ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు.
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవగీతం,జగిత్యాల/ధర్మారం:
ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచిందని తప్పు కేంద్రం వద్ద పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో ధాన్యం కేంద్రాన్ని మంత్రి సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు జరుగుతున్న తీరును, రైతులకు డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్న పరిస్థితిని రైతులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతియేటా మద్దతు ధర ప్రకటించి కొనుగోలు విషయాన్ని పట్టించుకోవడంలేదని మంత్రి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో గడచిన మూడు పంటల ధాన్యాన్ని రైతుల వద్ద సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్ల వద్ద నిల్వ చేసిందని మంత్రి వివరించారు. ఎఫ్ సి ఐ ద్వారా బియ్యం సేకరణ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం బాధ్యత మరిచి బియ్యం సేకరించక పోవడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రైస్ మిల్లులో పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలు పేరుకు పోయాయని మంత్రి తెలిపారు.రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలోని పరిస్థితిని వివరించి ఎఫ్ సి ఐ ద్వారా బియ్యం సేకరణ చేయించాల్సిన విషయం మరిచి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి అన్నారు. దేశ ప్రధాని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మాట మాట్లాడలేదని మంత్రి ఆరోపించారు. బాధ్యతగా రైతుల వద్ద నుండి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరిస్తుండగా బాధ్యత లేని బిజెపి నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

రైతులెవరు ఆందోళన పడవద్దని రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. కొనుగోలు పూర్తయిన తర్వాత మిల్లర్ల నుండి వచ్చే సమస్యలకు రైతులను బాధ్యులను చేయకుండా అధికారులు బాధ్యత తీసుకొని ఎలాంటి కోతలు విధించకుండా ధాన్యం దించుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. మిల్లర్లు దాన్యం ఏ బి గ్రేడ్ విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టవద్దని ఇబ్బందులు పెడితే రైస్ మిల్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి అడ్లూరి
ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుండి పెగడపల్లి మండలం కీచులాటపల్లి వరకు 8 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న నూతన రోడ్డు పనులను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. రూ. 11.21 కోట్లతో నిర్మిస్తున్న నూతన రోడ్డు ద్వారా ధర్మారం పెగడపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు. నూతన రోడ్డుతో భూముల ధరలు సైతం పెరుగుతాయని మంత్రి అడ్డూరి తెలిపారు. రోడ్డు నిర్మాణానికి రైతులు సహకరించి సహకరించాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ రైతులను కోరారు.


