జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు
రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ప్రారంభం : మంత్రి డా. వివేక్ వెంకటస్వామి
నవగీతం,సంగారెడ్డి :
తెలంగాణ ప్రభుత్వం మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ స్ఫూర్తితో పేద ప్రజలకు “ఇందిరమ్మ ఇండ్లు” అందిస్తోందని కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జీ వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఇందిరా గాంధీ ఇచ్చిన “గరీబీ హటావో” నినాదాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యరూపంలో చూపుతోందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామని, నిజమైన అర్హులకే ఈ ఇళ్లను అందిస్తున్నామని స్పష్టం చేశారు.జూన్ 2వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు అవుతున్నాయని పేర్కొన్నారు.సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూరు గ్రామంలో రూ.8 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు పనులు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి వివేక్ వెంకటస్వామి శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డులు అందజేస్తున్నామని, వాటి ద్వారా ఇతర సంక్షేమ పథకాలకు కూడా అర్హత లభిస్తుందని చెప్పారు. ప్రభుత్వ పెన్షన్ల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.భానూరు ప్రాంతంలో కొన్ని చిన్న రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఆర్ & బీ శాఖ కార్యదర్శితో మాట్లాడి రోడ్డు విస్తరణ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.గతంలో ఇందిరా గాంధీ మెదక్ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న సమయంలోనే విశాఖ ఫ్యాక్టరీని మెదక్ జిల్లాలో ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఆమె చొరవతోనే ఈ ప్రాంతంలో అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయని పేర్కొన్నారు. అప్పట్లో కాకా వెంకటస్వామి, టి. అంజయ్య తదితర నాయకులు ఐఎన్‌టీయూసీలో క్రియాశీలకంగా పనిచేశారని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి డా. జి వివేక్ వెంకటస్వామి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ టి. అంజయ్య చిత్రపటాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు.


